రికార్డు స్థాయిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేడు భారీ ఎత్తున వివిధ కార్పొరేషన్ లకు సంబంధించిన పదవులను భర్తీ చేయబోతున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.ఈ పదవుల్లో పూర్తిగా పార్టీకి విధేయులుగా గుర్తింపు పొందిన వారు, మొదటి నుంచి పార్టీ కోసం అండదండలు అందిస్తున్న వారితో ఈ పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో 56 కులాలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం, ఆ కార్పొరేషన్ లకు సంబంధించిన చైర్ పర్సన్ ల పేర్లు ప్రకటించబోతోంది.
చరిత్రలో ఎప్పుడూ లేని వి, అన్ని కులాలకు ప్రాతినిధ్యం దక్కే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా 56 కులాలకు సంబంధించిన కార్పొరేషన్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 30 వేలకు పైగా జనాభా ఉన్న కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది .వీటికి చైర్మన్ లుగా, ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా 29 మంది మహిళలు, 27 మంది పురుషులకు చైర్ పర్సన్ పోస్టులు దక్కబోతున్నాయి.
ఇక డైరెక్టర్ ల పదవులు విషయంలోనూ, మహిళలకు 50 శాతం పదవులు దక్కేలా, చైర్మన్ పదవులు విషయంలోనూ అన్ని జిల్లాలకు సమప్రాధాన్యం ఉండేలా లిస్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడా ఎటువంటి విమర్శలకు తావులేకుండా లిస్టు తయారు చేసినట్లు సమాచారం.