జగన్ కు ఏపీ హైకోర్ట్ గుడ్‌ న్యూస్.. ఇక ఆయన్ను అరెస్ట్ చేసేస్తారా..?

Chakravarthi Kalyan
ఏపీ హైకోర్టులో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఇటీవల తీర్పులు బాగా వస్తున్నాయి. అదంతా జగన్ సర్కారు చేసుకున్న తప్పిదాలే అని ఆయన వ్యతిరేకులు అంటుంటే.. అబ్బే కోర్టుల్లోనూ పక్షపాతం ఉందంటూ అనుకూల వర్గాలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఏపీ హైకోర్టులో జగన్ సర్కారుకు అనుకూలంగా తీర్పు వచ్చేసింది. ఐపీఎస్‌ సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పెట్టుకున్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఆయుధాలు అక్రమ కొనుగోలు కేసు నమోదుపై అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ఏబీ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది.

అంటే ఇక ఏబీ వెంకటేశ్వరరావును ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్నమాట. అసలు ఆయన్ను ఎందుకు అరెస్టు చేస్తారు అంటారా.. టీడీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్‌ వంటి పరికరాలు కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ పరికరాల ద్వారా చాలా మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారం అప్పటి సీఎంకు అందించారన్నది అభియోగం. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని జగన్ సర్కారు ఆయనపై చర్యలు తీసుకుంది.

ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే దీనిపై వెంకటేశ్వరరావు హైకోర్టు కు వెళ్లారు. మొత్తానికి అక్కడ కేసు గెలిచారు. ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలా ఆయన మళ్లీ విధుల్లోకి వచ్చారు. అయితే.. ఇప్పుడు సదరు ఇజ్రాయిల్ పరికరాల కేసును తిరగదోడుతున్న ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసే ప్రయత్నాల్లో ఉంది.

ఈ సమాచారంతో అలర్ట్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కానీ హైకోర్టు అందుకు అంగీకరించలేదు. దీంతో ఇప్పుడు ఏబీ అరెస్టుకు అంతా రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: