పవన్ పైనే బీజేపీ భారం ? ఆ ఎన్నికల్లో గట్టిక్కిస్తారా ?

ఇప్పటి వరకు జనసేనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, లేనట్టుగానే వ్యవహరించిన బిజెపికి పవన్ బలమేమిటో ఈ మధ్యనే తెలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వంపై పోరాటం అయినా, ఉద్యమం అయినా, బిజెపి ఒంటరిగానే ఎదుర్కొని ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నించింది. ఈ వ్యవహారాలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, ఆ పార్టీ అధినేత పవన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తూ వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అండదండలు లేకపోతే, జనసేన రాజకీయంగా మరింత ఇబ్బంది ఎదుర్కొంటుందనే భయంతో సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల క్రితమే తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇప్పుడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.


 ఈ నేపథ్యంలో ఇక్కడ గెలిచేందుకు వైసీపీ, టీడీపీ లు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ, బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. దీంతో జనసేన సహకారంతో బిజెపి సైతం తిరుపతి పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. రిజర్వ్ డ్ నియోజక వర్గమైన తిరుపతిలో ఇప్పటివరకు ఎప్పుడూ, బీజేపీ గెలిచింది లేదు. అయినా ప్రతి సారి పోటీ చేస్తూనే వస్తోంది. ఈసారి జనసేన సహకారం కూడా ఉండడంతో పాటు, కాపు సామాజిక వర్గం ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో తప్పనిసరిగా తామే గెలుస్తామని, బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగబోతున్న తొలి ఎన్నికలు కావడంతో ఆయన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.


 త్వరలో పవన్ తో కలిసి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించాలని సోము వీర్రాజు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బిజెపికి ఇక్కడ నాయకుల బలం ఉన్నా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో పూర్తిగా జనసేన పైనే భారం వేసి, ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. పవన్ ఎంతవరకు ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి, బిజెపి ఖాతాలో ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: