టికెట్ ఇస్తారా బీజేపీలోకి వెళ్ళమంటారా ? కేసీఆర్ కు మరో టెన్షన్

అందరికీ టెన్షన్ పుట్టించే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు సొంత పార్టీ నేతలే టెన్షన్ పెడుతున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో, ఆ స్థానంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య ను అభ్యర్థిగా ప్రకటించాలని చూస్తుండగా, సీనియర్ నేత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థి తానేనంటూ ప్రకటించుకుంటున్నారు. తనకు తప్ప మరెవరికీ ఇక్కడ అవకాశం లేదనే ధీమాతో ఉన్నారు. తన తండ్రి ముత్యంరెడ్డి కి కీలకమైన పదవి ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని , తనకు టిక్కెట్ ఇస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తాను అంటూ శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


.
అంతేకాక నియోజకవర్గం లో కలియతిరుగుతూ, తానే పోటీ చేయబోతున్నట్లు ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరు చెప్పినా ఆయన వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దీంతో సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత పేరుని ప్రకటిస్తే ఆమెకు శ్రీనివాస్ రెడ్డి వర్గం సహకరించే అవకాశం కనిపించకపోవడంతో టిఆర్ఎస్ బాగా టెన్షన్ పడుతోంది. దీంతో శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ తాను పోటీ చేయాలంటూ తన సన్నిహితుల దగ్గర శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టిఆర్ఎస్ టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన ప్లాన్ చేసుకుంటున్నారట. 



అలాగే ఆయన బిజెపిలో చేరేందుకు కు ఆసక్తి చూపించడం టిఆర్ఎస్ నేతలకు మరింత గుబులు పుట్టిస్తోంది. రెడ్డి సామాజిక వర్గం అంతా శ్రీనివాస్ రెడ్డి వైపు ఉండటం, ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది ఆ సామాజిక వర్గం కావడంతో, ఆయన బిజెపి వైపు వెళ్లకుండా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఆయన బీజేపీ లోకి వస్తే ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని, గెలుపు తమ ఖాతాలో పడుతుంది అని బిజెపి అంచనా వేస్తోంది. ఇక్కడ అభ్యర్థి గా ఉన్న రఘునందన్ రావు అవసరమైతే మరో కీలకమైన పదవి ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తనకు ఇస్తే టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని లేనిపక్షంలో తాను బీజేపీలో చేరేందుకు కూడాా సిద్ధమే అన్నట్లుగా  శ్రీనివాస్ రెడ్డి కొంతమంది టీఆర్ఎస్ కీలక నేతల దగ్గర వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చక్క పెడతారో ?  శ్రీనివాస్ రెడ్డి ని ఏ విధంగా బుజ్జగిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: