కరోనా ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో .. మళ్లీ కొత్తగా కేసులు !

NAGARJUNA NAKKA
కరోనా వైరస్‌ తొలి వేవ్.. అతి భయంకరంగా ఉంది. మనదేశం ఇంకా ఈ మహమ్మారి బీభత్సం నుంచి కోలుకోనేలేదు. ఆగస్ట్‌ నాటికే వందలో 15 మందికి కరోనా వచ్చి ఉంటుందని.. సెరో సర్వే తేల్చింది.

మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 63లక్షలు దాటేసింది. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కాస్త తగ్గుతోంది. అయితే ఇంతలోనే కరోనా గురించి మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. మన దేశంలో తొలి కరోనా కేసు నమోదయిన కేరళలో.. సెకండ్‌ వేవ్‌ మొదలైందని.. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ తప్పదేమోనని అని అన్నారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకూ కేరళ సంప్రదాయ పండుగ ఓనం జరిగింది. ఈ పండుగ తరువత కేరళలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.  ముఖ్యంగా 20 నుంచి 40 సంవత్సరాల వయసు వారే వైరస్‌ బారిన పడ్డారు. కరోనా ఇండియాకు ప్రవేశించిన తొలి దశలో, అత్యధిక కేసులను ఉన్నప్పటికీ.. వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేసిన రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది కేరళ. ఇప్పుడు అక్కడ రెండవ విడతగా  మహమ్మారి విజృంభిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 40 వేల కొత్త కేసులు వచ్చాయి. ఓనమ్ కోసం నిబంధనలను సడలించడం, దేవాలయాలను తెరవడం, రాజకీయ పార్టీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం.. కేసుల పెరుగుదలకు కారణాలని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికీ భారత్‌ తొలి వేవ్‌ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అలాంటిది కరోనా ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో కూడా.. మళ్లీ కొత్తగా కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే భారత్‌లో ఆగస్టుకల్లా దాదాపు 20 కోట్ల మందికి కరోనా వైరస్‌ వచ్చిపోయిందని ఐసీఎంఆర్‌ సర్వే వెల్లడించింది. దేశంలో 15.9 కోట్ల నుంచి 19.6 కోట్ల మందికి కరోనా సోకిందని, 10ఏళ్ల కంటే పై వయసున్న వారిలో ప్రతి 15మందిలో ఒకరికి కరోనా సోకినట్లు వెల్లడైంది.  పట్టణ స్లమ్‌ ఏరియాల్లో 15.6శాతం మందికి ఇప్పటికే కరోనా వచ్చిపోయిందని, నగరంలోని కాలనీల్లో కనీసం 8.2 శాతం మంది ఇప్పటికే కరోనా బారిన పడినట్లు తేలింది.  గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 4.4శాతం మందికి కరోనా వచ్చిపోయిందని పేర్కొంది. వయసు, ఆడ, మగ తేడా లేకుండా కరోనా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. దేశ యువతలో 7.1 శాతం మంది జనాభా కరోనా బారినపడినట్లు ఐసీఎంఆర్ సెరో సర్వేలో గుర్తించారు. దేశంలో వ‌చ్చేదంతా పండుగ‌ల సీజ‌న్ కావ‌టంతో వైర‌స్ వ్యాప్తి మ‌రింత ఎక్కువ‌య్యే ప్రమాదం ఉంద‌ని ఐసీఎంఆర్ హెచ్చరించింది. ప్రజ‌లు గుమిగూడ‌కుండా, వైర‌స్ వ్యాప్తి అరిక‌ట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొర‌వ తీసుకోవాల‌ని ఐసీఎంఆర్ అభిప్రాయ‌ప‌డింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: