శశికళకు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్..!

NAGARJUNA NAKKA
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అంతకుముందే జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలవుతుందనే వార్తలు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అయితే శశికళకు చెక్‌ పెట్టేందుకు తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రయత్నాలు ప్రారంభించారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది.


జయలలిత మరణించిన తర్వాత కూడా తమిళనాడులో శశికళ తన పట్టు నిలుపుకుంది. ఇది అన్నాడీఎంకే వర్గాలకు మింగుడు పడడం లేదు. ఇప్పుడు కర్ణాటకలో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ.. వచ్చే ఏడాది జనవరిలో విడుదలవనున్నారు. అదే జరిగితే ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేలో తీవ్ర పరిణామాలు ఉంటాయని అంచనా. ముఖ్యంగా పళనిస్వామి, పన్నీర్‌సెల్వం తీరుతో విసిగిపోయిన కొంతమంది అసంతృప్త నేతలు పార్టీని వీడి శశికళ పంచన చేరడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. అదే జరిగితే ఎన్నికల్లో అన్నాడీఎంకేకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.


ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు అన్నాడీఎంకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈసారి సీఎం ఛాన్స్ తనకు ఇవ్వాలంటూ ఇప్పటికే పన్నీర్ సెల్వం అల్టిమేటం జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శశికళ ఎంటరైతే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని సీఎం పళనిస్వామి బావిస్తున్నారు. అందుకే ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.


జయలలిత మృతిపై అనుమానాలున్నాయంటూ నాడు పన్నీర్‌ సెల్వం డిమాండ్ చేయడంతో జస్టిస్‌ ఆరుముగస్వామి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటివరకూ ఈ కమిటీ జయలలిత మృతిపై తుది నివేదిక ఇవ్వలేదు. కమిటీ పదవీకాలాన్ని ఎనిమిది సార్లు పొడిగించింది. ఫిర్యాదు చేసిన పన్నీర్‌ సెల్వంను మినహాయించి.. ఇప్పటివరకూ 154 మంది సాక్షులను విచారించింది. అయితే తమను దోషిగా ప్రయత్నించేందుకు కమిటీ ప్రయత్నిస్తోందని.. విచారణ నుంచి మనహాయింపు ఇవ్వాలంటూ అపోలో ఆసుపత్రి కోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. దీంతో ఈ కమిటీ ముందుకు సాగలేదు.


 అయితే ఇప్పుడు కమిటీని మరోసారి యాక్టివ్‌గా మార్చేందుకు సీఎం పళనిస్వామి ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా స్టే నుంచి విముక్తి కల్పించి.. జయలలిత మృతిపై విచారణ వేగవంతం చేయాలని భావిస్తున్నారు. నాడు జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో శశికళే దగ్గరుండి చూసుకున్నారు. స్టే ఎత్తేయడం ద్వారా ఆమెను విచారించేందుకు కమిటీకి వీలవుతుంది. అలా శశికళ నుంచి గట్టెక్కేందుకు పళనిస్వామి పెద్ద స్కెచ్చే వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: