బాలయ్య కోరిక లక్ష్మీపార్వతి నెరవేర్చరా? తమ్ముళ్ళకు నచ్చలేదా?

M N Amaleswara rao
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నేతల విగ్రహాలు ఏపీలో ఎక్కువ కనబడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉండటంతో, రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కువ వెలిశాయి. అలాగే వైఎస్సార్ విగ్రహాలు కూల్చివేతలు ఎక్కువ జరిగాయి. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. దీంతో రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

 అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహాల కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ముసునూరు గ్రామంలో ఉన్న ఓ ఎన్టీఆర్ విగ్రహం దేవాలయానికి అడ్డంగా ఉందని చెప్పి, వైసీపీ నేతలు తొలగించారు. దీనిపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అసలు ఎన్టీఆర్ విగ్రహం అడ్డుకాకపోయినా కావాలనే తొలగించారని తమ్ముళ్ళు మండిపడ్డారు.

ఈ విషయంలో చంద్రబాబు, బాలయ్యలు కూడా కలుగజేసుకున్నారు. విగ్రహం తిరిగి పెట్టేవరకు పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే బాలయ్య ఓ అడుగు ముందుకేసి అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేతో మాట్లాడి, విగ్రహం మళ్ళీ పెట్టేలా చొరవ తీసుకోవాలని కోరారు.  దీంతో ఎమ్మెల్యే కూడా విగ్రహం పెట్టిస్తానని మాట ఇచ్చారు. కానీ ఆ అంశంపై తమ్ముళ్ళు గట్టిగానే పోరాడుతూ వచ్చారు.

ఈ క్రమంలోనే వైసీపీ నేతలే ఊహించని విధంగా  ప్రత్యామ్నాయంగా వేరేచోట ఎన్టీఆర్ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహావిష్కరణకు వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి హాజరయ్యారు. ఈ విధంగా బాలయ్య కోరికని లక్ష్మీపార్వతి చేతుల మీదుగా నెరవేరింది.
కానీ ఈ విషయంలో తమ్ముళ్ళు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. గతంలో విగ్రహాన్ని తొలగించిన చోట ఏర్పాటు చేయాలని తెలుగుదేశం, ఎన్టీఆర్ అభిమానుల డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం నేతలు దూరంగా ఉన్నారు. మరి బాలయ్య వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫైబర్ విగ్రహం విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తారో లేక..కాంస్య విగ్రహం పెట్టేవరకు పోరాడుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: