తెలుగు రాష్ట్రాలకు వాన గండం..!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ సూచనలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేసింది. హైదరాబాద్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటంతో రాబోయే 72 గంటల పాటు అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 9 నుంచి 16 సెంటిమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణశాఖ అధికారులు..
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం.. ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు 8 క్రస్టుగేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలను వానగండం వెంటాడుతోంది.