హైదరాబాద్ లో భారీ వర్షాలకు ఆస్తి నష్టం తీవ్రంగా సంభవించింది. ముఖ్యంగా వరదనీటికి కొట్టుకుపోయిన వాహనాల లెక్క తీస్తే.. ఆస్తి నష్టం వెయ్యి కోట్లకు పైమాటేనంటున్నారు. భారీ వర్షాలకు హైదరాబాద్ రోడ్లన్నీ ఏరులయ్యాయి. రోడ్డుపై పార్కింగ్ చేసిన ఏ వాహనం కూడా అది ఉన్నచోట లేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని ప్రాంతాల్లో కార్లు వరదనీటికి కొట్టుకుపోయాయి, మోటర్ సైకిళ్ల సంగతి చెప్పేదేముంది. హైదరాబాద్ లో 5వేలకు పైగా కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో ఐదువేల కార్లు వర్షపు నీటి వల్ల డ్యామేజీ అయ్యాయి. 20వేలకు పైగా బైక్ లు నీటమునిగిపోయాయి. నీరు తగ్గితే కానీ వీటి పరిస్థితి చెప్పలేం. ఇక మూసీ పరీవాహక ప్రాంతంలో పార్క్ చేసిన లారీలయితే.. వందకు పైగా వరద నీటికి కొట్టుకుపోయినట్టు ఓనర్లు చెబుతున్నారు. సుమారు 10వేల ఆటోలు డ్యామేజీ అయ్యాయి. వీటన్నిటి లెక్క తీస్తే.. కేవలం వాహనాల వల్లే వెయ్యికోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో షోరూమ్ లలోకి నీరు చేరడంతో సీల్డ్ బండ్లు కూడా డ్యామేజీ అయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,500 పైగా కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. 20,540 ఇళ్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సుమారు 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి. వందేళ్ల తర్వాత కురిసిన రికార్డు స్థాయి వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వానలకు నాలాలు ఉప్పొంగాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులు తెగిపోయాయి. కుంటలు పొంగిపొర్లాయి. వాటిల్లో ఉండాల్సిన నీళ్లు రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి చేరాయి. విజయవాడ, కరీంనగర్, వరంగల్ మార్గాలు జలమయమయ్యాయి.
జీహెచ్‌ఎంసీలోని ఈస్ట్, సౌత్ జోన్లలో ఎక్కువ నష్టం వాటిల్లింది. నగరంలో 1,500 కాలనీలకుపైగా నీట మునిగాయి. సరూర్‌నగర్, గడ్డిఅన్నారం, దిల్ సుఖ్ నగర్ పాంతాల్లో దాదాపు 200 కాలనీలు జలమయమయ్యాయి. బోయిన్ చెరువు తెగడం, హస్మత్ పేట నాలా పొంగిపొర్లడంతో దాదాపు 100 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఫలక్ నుమా, కవాడిగూడ అరవింద్ కాలనీ, రామంత పూర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను బోట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు.
దాదాపు పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, లక్షా యాభై వేల మందికి ఆహారం అందజేసినట్లు అధికారులు తెలిపారు. 24 గంటలు పనిచేసే 30 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో ఏకంగా 24 మంది మరణించారు. ఈమేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్నిచోట్లఇళ్ల నుంచే వరద సాగడంతో ఆ ప్రవాహంలో పలువురు కొట్టుకుపోయి విగతజీవులయ్యారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 11 మంది మరణించారు. రంగారెడ్డి జిల్లాలో ఏడుగురు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు, మేడ్చల్ జిల్లాలో ఇద్దరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.