మంత్రి వెల్లంపల్లికి సీరియస్..

Deekshitha Reddy
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ కి తరలించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. కరోనా కష్టకాలంలో కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా.. సహాయక చర్యలు కూడా చేపట్టారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడ్డ వారికి తనవంతు సాయం అందించారు. మరోవైపు ఇటీవల దేవాలయాలపై జరుగుతున్న దాడులు, తదనంతర పరిణామాలపై కూడా ఆయన చురుగ్గానే స్పందించారు. అంతర్వేది రథం దగ్ధమైన ఘటనపై విచారణ సీబీఐకి అప్పగించడం వెనక కూడా ఆయన ఆలోచన ఉంది. సీఎం నిర్ణయంతో ఆ కేసుని సీబీఐకి అప్పగించారు. అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన విగ్రహాల ధ్వంసంపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. విగ్రహాల ధ్వంసం వెనక ఎలాంటి కుట్ర జరిగినా ఛేదిస్తామని, ఎవర్నీ వదిలిపెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
కొద్దిరోజుల క్రితం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనాబారిన పడ్డారు. దీంతో ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుంటుండగానే.. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మెరుగైన వైద్యంకోసం ఆయన్ను హైదరాబాద్ తరలించాలని చూశారు కుటుంబ సభ్యులు. అయితే రోడ్డు మార్గం లేకపోవడం, ఆలస్యమైతే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో.. ముఖ్యమంత్రి జగన్ చొరవతో ప్రత్యేక విమానంలో ఆయన్ను హైదరాబాద్ చేర్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఆయన ఆరోగ్యంపై స్పందించేందుకు మాత్రం వారు నిరాకరించారు. ప్రస్తుతానికి వెల్లంపల్లి ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మరోవైపు మంత్రి వెల్లంపల్లి త్వరగా కోలుకోవాలని.. ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలు.. వెల్లంపల్లి ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: