గోల్డ్ స్కామ్‌ సూత్రధారికి మాఫియాతో సంబంధాలున్నాయా?

NAGARJUNA NAKKA
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కామ్‌ సూత్రధారికి అండర్‌వరల్డ్ మాఫియాతో సంబంధాలున్నాయా?  గోల్డ్ స్కామ్ నిధులు విద్రోహశక్తుల చేతికి చేరుతున్నాయా..? ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఐఏ ఇచ్చిన నివేదికలో ఏముందనే సందేహాలు ఇపుడు తలెత్తుతున్నాయి.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసు తవ్వినకొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుతో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధాలున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబందించి పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు .. గోల్డ్ లింక్స్‌పై విచారించారు. ఆ విచారణకు సంబంధించి నివేదికను ప్రత్యేక న్యాయస్థానానికి.. ఎన్ఐఏ అధికారులు సమర్పించారు. ఇందులో కీలక అంశాలను ప్రస్తావించారు అధికారులు.

1993 వరుస పేలుళ్లతో ముంబైను గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్‌ దావూద్‌ పేరును.. ఈకేసులో ఎన్ఐఏ అధికారులు ప్రస్తావించారు. ప్రదాన నిందితునికి, దావూద్‌తో సంబంధాలున్నాయని అనుమానాలు వ్యక్తంచేశారు. అంటే ఈ గోల్డ్ నిధులు.. దావూద్ ఖాతాలోకి చేరుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దికాలం నుంచి అండర్‌వరల్డ్ మాఫియా ముంబయితో పాటు దేశం బయటపడుతోందని.. మాఫియా కార్యకలాపాలు తగ్గాయని అందరూ భావిస్తున్న సమయంలో.. ఎన్ఐఏ  నివేదికతో ప్రకంపనలు మొదలయ్యాయి. అంటే దావూద్.. ఇప్పటికీ ఇండియాలో నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడంటూ వస్తున్న ఆరోపణలకు.. తాజా నివేదిక బలం చేకూరుస్తోంది.

కేరళ గోల్డ్ స్కామ్‌లో బయటపడుతున్న అంశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితల. కేరళలో జరిగిన అతి పెద్ద నేరాల్లో ఇదొకటన్నారు.ఈ కేసులోని ప్రధాన నిందితునికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడికావడం దురదృష్టకరమని చెప్పారు. నిందితులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తోందని మరోసారి ఆరోపించారు. ఇదే విషయాన్ని యూడీఎఫ్.. మొదటి నుంచి చెబుతూ వస్తోందన్నారు.
మొత్తానికి కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని కటకటాల వెనక్కి నెట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: