కృష్ణా నదికి భారీగా వరద !

NAGARJUNA NAKKA
ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల దగ్గర పెరుగుతున్న వరద ఉధృతి..! ఆందోళనలో  లోతట్టు ప్రాంతాల ప్రజలు...! 18 మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు..! ఇదీ కృష్ణా నది తాజా పరిస్థితి. కృష్ణా నదికి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భారీవర్షాలు, వరదలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన రాష్ట్రాల్లో భారీవర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు ఇతర మార్గాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లే అధికారులు కిందకు వదులుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంట పొలాలు ముంపునకు గురవడంతో కృష్ణా కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలశయానికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి ఇన్‌ప్లో ఎక్కువగా ఉండగా... 10 గేట్లను 33 అడుగుల మేర ఎత్తి  నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్‌ జలాశయానికి కూడా భారీగా వరదనీరు చేరుతోంది. ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో 18 క్రస్ట్‌ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు.
పులిచింతల నుంచి లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుండడం, అది మరింతగా పెరిగే పరిస్థితి కనిపిస్తుండడంతో..అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్లు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో బురద మేటలు వేసింది. భారీ వరదలకు మట్టికొట్టుకొచ్చి...కాలనీలన్ని చిత్తడిగా మారాయి. ఎక్కడ చూసినా బురద పేరుకుపోయిన దృశ్యాలే కన్పిస్తున్నాయి. కాలనీల్లోని రోడ్లపై ఇసుక మేటలు వేసింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి.
అడుగుతీసి అడుగు వేయాలన్నా ఇబ్బందిగా మారింది. వరదకు చెత్తాచెదారం కొట్టుకువచ్చింది. అసలే చెత్తా పైగా రెండుమూడు రోజులు నీటిలో ఉండటంతో...పరిసరాలు కంపుకొడుతున్నాయి. వరదలకు జంతువుల కళేబరాలు కొట్టుకొని రావడం, కొన్ని మృత్యువాత పడి అక్కడే పడి ఉండి దుర్గంధం వెదజల్లుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: