హైదరాబాద్: చిరంజీవి ఢిల్లీ వెళ్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స ఢిల్లీ వెళ్లి ఫలితాలపై నివేదికలిచ్చారు. ఎవరికి వారు వారి వారి నివేదికలను అందచేశారు. ఫిర్యాదులు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా చిరంజీవి వంతు వచ్చింది. ఢిల్లీ వెళ్లి అక్కడ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర పెద్దల్ని కలిసి తాను తయారు చేసుకున్న నివేదికలను అందచేసే అవకాశం వుంది. ఉప ఎన్నికల ఫలితాలపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సంచలనంరేపాయి. ఈ నేపథ్యంలో చిరు ఢిల్లీకి వెళ్తుండటం, పెద్దల్ని కలవనుండటంతో ఆయన ఎవరిపై ఫిర్యాదు చేస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు సరిగ్గా పనిచేయలేదనీ, పీఆర్పీ శ్రేణుల్ని వినియోగించుకోలేదనీ, గెలిచిన రెండు స్థానాలు తనవల్లనే గెలిచాయనీ చిరంజీవి అంటున్నారు.
కాంగ్రెస్ నాయకులు పనిచేయకపోవడం, ఐక్యత లేకపోవడం వల్లనే ఆశించిన ఫలితాలు రాలేదనీ చిరంజీవి వాదిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఓటమి చెందిన స్థానాలకు తనకు సంబంధం లేదనీ చిరంజీవి అధిష్టానంకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌లోని ఒక వర్గం గుర్రుగా వుంది.
ఉప ఎన్నికల్లో చిరు చరీష్మా పనిచేయలేదంటూ గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా చిరంజీవి ఢిల్లీ పర్యటన కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరిపైన ఫిర్యాదు చేస్తారో చూడాలి మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: