తెలుగు రాష్ట్రాలను వీడని వానగండం !

NAGARJUNA NAKKA
తెలుగు రాష్ట్రాలను వానగండం ఇంకా వీడలేదు. మధ్య బంగాళాఖాతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడి.. 24గంటల్లోనే అది తీవ్రరూపం దాల్చుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉందని హెచ్చరించింది.
మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న  మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలపడి 24 గంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా మారనుందనీ... దీని ప్రభావంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపటి నుంచి 21వ తేదీ వరకూ కోస్తా, యానాం పరిసర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
తూర్పు మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్రకు దక్షిణ దిశగా, ముంబై నగరానికి పశ్చిమ వాయవ్య దిశగా ఈ వాయుగుండం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం రానున్న 48గంటల తర్వాత బలహీనపడే అవకాశముందని పేర్కొంది.
ఉత్తరాంధ్ర, తెలంగాణ దక్షిణ మధ్య మహారాష్ట్ర దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోంకణ్ దగ్గర కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 1.5కిమీ నుంచి 3.1కిమీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణా కోస్తాంధ్ర, రాయలసీమలో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: