రేపటి నుంచి ప్రతి ఇంటికి వరద సాయం ‌... కేసీఆర్

SS Marvels
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ వాసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు. నగరంలో వరద ప్రభావానికి గురైన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. మంగళవారం (అక్టోబర్ 20) ఉదయం నుంచే ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50,000ల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపడతామని.. మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రూ.10 కోట్ల విరాళం అందించారు. చెన్నై నుంచి పరుపులు, బెడ్‌షీట్లు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు పెద్ద ఎత్తున విరాళాలు అందించాల్సిందిగా పిలుపు ఇచ్చారు. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ వర్షం కురిసిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ వరద పరిస్థితులపై సోమవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భాగ్యనగరంలో వందేళ్ల కిందట మూసీకి వరదలు వచ్చిన సమయంలో 43 సెం.మీ. వర్షం కురిసిందని.. ఈ ఏడాది ఇప్పటికే 120 సెం.మీ. వర్షపాతం నమోదైందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరింత వర్షపాతం నమోదవుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: