గోదావరి మహోగ్ర రూపం..!

NAGARJUNA NAKKA
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. జలాశయాలన్ని జలకళను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం నుంచి పోలవరం వరకూ ఉద్థృతంగా ప్రవహిస్తోంది గోదావరి. మన్యంలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 9.4 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. మరోవైపు బ్యారేజీ నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బుధవారం విడుదల చేసిన 2.25 లక్షల క్యూసెక్కుల నీటితో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా అధికం. వరద ప్రవాహానికి గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులు జలకళను సంతరించుకున్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లంక భూముల్లోకి నీరు వచ్చి చేరుతోంది.
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భూపతిపాలెం, ముసురుమిల్లి, మద్దిగడ్డ, సూరంపాళెం జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. భూపతిపాలెం జలాశయం నిల్వ సామర్థ్యం కన్నా నీరు చేరడంతో ఓ గేటు ఎత్తి 155 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేశారు. గోదావరి పోర్టుకు ఒడ్డున ఉన్న గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి. దేవీపట్నం, కె.వీరవరం, తొయ్యేరు జలదిగ్బంధం అవ్వగా ప్రజలు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని కొత్తూరు కడెమ్మ వంతెనపైకి వరదనీరు చేరింది. దీంతో మండలంలోని 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం స్పిల్‌వే ఛానల్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. దేవీపట్నం మండలం పూడిపల్లి వద్ద గోదావరి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆంధ్రా-ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమా జలాశయం ప్రమాదస్థాయికి చేరింది. 2,590 అడుగుల సామర్థ్యం గల ఈ జలాశయంలో ప్రస్తుతం 2589.9 అడుగులమేర వరద నీరు వచ్చి చేరింది. దీంతో 2వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: