తెలుగు రాష్ట్రాల్లో భయం భయం..!
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. నిన్న మధ్యాహ్నం, రాత్రి కూడా చాలాప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరుణుడు హైదరాబాద్ పై పగబట్టాడేమో అనిపిస్తోంది. వరుసగా కురుస్తున్న వానలతో నగరవాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీళ్లలో నానుతున్నాయి. మళ్లీ కుండపోత వాన హెచ్చరికతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు నగరవాసులు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలు.. హైదరాబాద్ వాసులను టెన్షన్ పెడుతున్నాయి.
మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. అల్పపీడనం ఏర్పడే అవకాశం అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తోంది వాతావరణశాఖ. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వెదర్ అలర్ట్తో హైదరాబాద్లోని చాలా ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే 10 రోజులుగా చాలా కాలనీలు వర్షంలో నానుతున్నాయి.
అటు ఏపీలోనూ కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి రెండు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరీ ముఖ్యంగా కృష్ణా నదికి వరద పోటెత్తే అవకాశం ఉంది కాబట్టి పరివాహక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మొత్తానికి వర్షాలు తెలుగు రాష్ట్రాలను వణికించేస్తున్నాయి. వర్షం పడుతుందన్న హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం నరకంగా మారగా.. జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నారు.