ఏపీ సర్కార్ ని మళ్ళీ టార్గెట్ చేసిన పవన్...!

రైతులు పూర్తిగా నష్టపోయారని... పెట్టుబడి మొత్తాన్ని పరిహారంగా తక్షణమే చెల్లించాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గతేడాది పంట నష్ట పరిహారం కూడా రైతులకు ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. భారీ వర్షాలు, వరదల మూలంగా నష్టపోయిన రైతులు తమ పంటలను పూర్తిగా నష్టపోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేసారు.  ఖరీఫ్ సీజన్ లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటి పాలైంది అని మండిపడ్డారు.  రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదు అని ఏపీ ప్రభుత్వ టార్గెట్ గా విమర్శలు చేసారు.
 నష్టం అంచనాలను రూపొందించే ప్రభుత్వం పరిహారాన్ని అందించడంలో ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది అని అన్నారు.  గత ఏడాది జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం ఇప్పటికీ కూడా చెల్లించలేదని రైతాంగం ఆవేదన చెందుతున్నారు అని పేర్కొన్నారు. ఈసారి పరిహారం ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.  భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా ప్రభావితం అయిన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన నాయకులు పర్యటించి ముంపులో ఉన్న పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించారని చెప్పారు.
ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.  అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పంటలు నష్టపోయి ఉంటాయని క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళిన నాయకులు తెలియచేశారని ఆయన వివరించారు. ప్రధానంగా వరి పంట నీట మునిగి కుళ్లిపోతోంది అని అన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరి సాగు చేసినవారి పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. ఉద్యాన పంటలు వేసినవారు, కృష్ణా లంక భూముల్లో కూరగాయలు సాగు చేసేవారు, కడియం  ప్రాంతంలో నర్సరీ రైతులు నష్టాల పాలయ్యారని ఆయన  పేర్కొన్నారు. ఈ విపత్కర కాలంలో పెట్టుబడి రాయితీలు చెల్లిస్తాం, నష్టాలను లెక్కిస్తామని అన్నారని... ఆ ధోరణిని ప్రభుత్వం, పాలకులు విడిచిపెట్టాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: