కొవిడ్ వ్యాక్సిన్ ట్రైల్స్ లో దారుణం.. వాలంటీర్ మృతి!

Deekshitha Reddy
కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ లో వాలంటీర్ మృతిచెందాడన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రేపో మాపో కొవిడ్ కి వ్యాక్సిన్ వస్తుందని అందరూ నమ్ముతున్న వేళ, ఇలాంటి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తయారుచేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ జరుగుతున్న సందర్భంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. ఆ వాలంటీర్ స్వయానా ఓ డాక్టర్ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఈ వ్యాక్సిన్ ట్రైల్స్ లో పాల్గొన్న వాలంటీర్ ఒకరు బ్రెజిల్ లో కోవిడ్ తో మరణించినట్టుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ మీడియా నివేదికలు మాత్రం.. అతనికి వ్యాక్సిన్ ఇవ్వలేదని, వ్యాక్సిన్ అని నమ్మించి ఇచ్చే డమ్మీ మందు (ప్లేస్ బో) అని పేర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ట్రైల్స్ లో ఒక వాలంటీర్ మరణించడం ఇదే తొలిసారి. గతంలో క్లినికల్ ట్రైల్స్ లో పాల్గొన్న ఓ వాలంటీర్ కి తీవ్ర అనారోగ్యం సోకడంతో కొన్నిరోజులపాటు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రైల్స్ ఆపేశారు. తీరా ఇప్పుడు ఏకంగా ఓ వాలంటీర్ మరణించారన్న వార్త తీవ్ర కలకలం రేపుతోంది.
అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి భయాలు లేవని, నిపుణుల చేత నిర్వహించబడిన ఒక ఇండిపెండెంట్ రివ్యూలో సైతం ఇదే తేలిందని, వ్యాక్సిన్ ట్రైల్స్ కొనసాగుతాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పేర్కొనడం విశేషం. మరణించిన వాలంటీర్ 28 సంవత్సరాల వయసున్న వైద్యుడని మీడియా పేర్కొంది. కోవిడ్ ని ఎదుర్కోవటంలో నిరంతరం శ్రమిస్తున్న ఈ వైద్యుడు కోవిడ్ లక్షణాలతో మృత్యువాత పడ్డాడని తెలిపింది.
అయితే బ్రెజిల్ వార్తా పత్రిక గ్లోబో, అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్ బెర్గ్ మాత్రం అతను వ్యాక్సిన్ ట్రైల్స్ లో కంట్రోల్ గ్రూపులో ఉన్నాడని, అతనికి ఇచ్చింది వ్యాక్సిన్ కాదని, డమ్మీ మందు ప్లేస్ బో మాత్రమేనని పేర్కొన్నాయి. వైద్యపరమైన గోప్యతా నిబంధనలను బట్టి ఆ వాలంటీర్ వివరాలను ఇవ్వలేమని ఆస్ట్రాజెనికా తెలిపింది. బ్రెజిల్ లో 8వేలమంది వాలంటీర్లకు, ప్రపంచవ్యాప్తంగా 20వేలమంది వాలంటీర్లకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రైల్ డోస్ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: