ట్రంప్, బైడెన్ ల విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయంటే..!

NAGARJUNA NAKKA
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విమర్శల వాడి పెంచుతున్నారు అభ్యర్థులు. కరోనా విషయంలో ట్రంప్‌ను బైడెన్‌ కార్నర్‌ చేస్తుంటే.. బైడెన్‌ రష్యా ఏజెంట్ అంటూ విరుచుకుపడుతున్నారు. బైడెన్‌కు రష్యా నుంచి డబ్బు అందిందంటూ ట్రంప్‌ చేస్తున్న ఆరోపణలపై దుమారం రేగుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. నోరు విప్పి మాట్లాడటమే రాని బైడెన్‌ దేశానికి అధ్యక్షుడై ఎలా గతంలో విమర్శించారు ట్రంప్‌. అయితే అది పెద్దగా వర్కవుట్‌ కాలేదు. దీంతో బైడెన్‌ అవినీతిపరుడని, రష్యా ఏజెంటని ఆరోపిస్తున్నారు ట్రంప్‌. తాగా ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు ట్రంప్‌.
రష్యా నుంచి బైడెన్‌కు మూడున్నర మిలియన్‌ డాలర్లు అందాయనేది ట్రంప్‌ ఆరోపణ. బైడెన్‌ తనయుడు హంటర్‌ బైడెన్‌ ద్వారా ఈ డబ్బు అందిందంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మాస్కో మాజీ మేయర్‌ అత్యంత సన్నిహితుడని.. అతని భార్య ద్వారా బైడెన్‌కు  నిధులు అందినట్టు చెప్పుకొచ్చారు ట్రంప్‌. వ్యాపారవేత్త అయిన మాజీ మేయర్‌ భార్య ఎలినా బటురినా.. 2014లో  హంటర్‌ బైడెన్‌కు చెందిన కంపెనీ రోస్‌మంట్‌ సెనెకా థార్న్‌టన్‌కి డబ్బు పంపారనేది ట్రంప్‌ ఆరోపణ.
రిపబ్లికన్లు ఆరోపిస్తున్నట్టు ఆ సంస్థతో హంటర్‌ బైడెన్‌కు సంబంధమే లేదు. ఆయన దానికి అధిపతి కాదు. దీనిపై గతంలో దర్యాప్తు కూడా జరిగింది. కన్సల్టెన్సీ అగ్రిమెంట్‌లో భాగంగా ఆ మొత్తం అందినట్టు తేలింది. అంతకు మించి దర్యాప్తు నివేదికలో ఏమీ చెప్పలేదు.
పెట్టుబడుల సంస్థ రోస్‌మంట్‌ సెనెకా అడ్వైజర్స్‌ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా, సీఈఓగా పని చేశారు హంటర్‌  బైడెన్‌. అయితే రోస్‌మంట్‌ సెనెకా థార్న్‌టన్‌కు అతను సహ వ్యవస్థాపకుడు కాదు. అంతే కాదు రోస్‌మంట్‌ సెనెకా అడ్వైజర్స్‌, రోస్‌మంట్‌ సెనెకా థార్న్‌టన్‌ కంపెనీల మధ్య సంబంధం ఉందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. హంటర్‌ బైడెన్‌కు తప్పు చేశాడని, అతనికి తప్పుడు మార్గంలో నిధులు అందాయని అటు సెనేట్‌ రిపోర్టు గాని, ఇటు ట్రంప్‌ గాని ఎలాంటి ఆధారాలు చూపించలేదు.
ట్రంప్‌  ఆరోపణలను హంటర్‌ బైడెన్‌ ఖండించారు. ఉక్రెయిన్‌లో తమ వ్యాపారాల గురింది తండ్రి జో బైడెన్‌తో తానెప్పుడు చర్చించలేదంటున్నాడు హంటర్‌ బైడెన్‌. మూడవ డిబేట్‌లో ట్రంప్‌ ఆరోపణలను జో బైడెన్‌ ఖండించారు. తన జీవితంలో ఇంత వరకూ విదేశాల నుంచి ఒక్క డాలర్‌ కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే, ట్రంప్‌కు చైనాలో ఓ రహస్య బ్యాంక్‌ ఖాతా ఉందని ఆరోపించారు జో బైడెన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: