నిజంగానే మహేష్ బాబుని జగన్ ఫాలో అయ్యారా..?

Deekshitha Reddy
ఏపీలో భారీగా పెరిగిన ట్రాఫిక్ చలాన్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. భరత్ అనే నేను సినిమా చూసిన తర్వాత సీఎం జగన్ ఈ పని చేశారని, అపరాధ రుసుములు బాగా పెంచారని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఈ విమర్శలను అదే స్టైల్ లో తిప్పికొట్టారు మంత్రి పేర్ని నాని. సినిమాలో మహేష్ బాబు సీఎం గా ట్రాఫిక్ చలాన్లు భారీగా పెంచితే జనం థియేటర్లలో చప్పట్లు కొడతారని, మనకి కూడా ఇలాంటి సీఎం రావాలని అనుకుంటారని.. అదే జనాలు బైటకొచ్చి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తుంటారని అన్నారు.
థియేటర్లో చప్పట్లు కొట్టే జనాలు, నిజ జీవితంలో అలాగే చలాన్లు పెంచితే ఎందుకు దాన్ని స్వీకరించరని అన్నారు. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడటం లేదని, కేవలం ప్రతిపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పారు మంత్రి. ట్రాఫిక్ రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్లనన్ని రోజులు అసలు చలాన్లతో వాహనదారులకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఎవరికి వారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చలాన్ల విషయం పట్టించుకోనవసరం లేదని తేల్చి చెప్పారు మంత్రి పేర్ని నాని.
"ముందు గుంతలు బాగుచేయండి, తర్వాత ఫైన్లు వేయండంటూ టీడీపీ వాళ్లు సెటైరిక్ గా మాట్లాడుతున్నారు. గుంతలకు, ఫైన్లకు సంబంధం ఉందా? గోతులుంటే అడ్డగోలుగా బండి తోలొచ్చా, లైసెన్స్ లేకుండా తోలొచ్చా. ఇవన్నీ టీవీ ప్రొగ్రామ్స్ లో హాస్యం పండించడానికి బాగుంటాయి, కానీ వాస్తవ పరిస్థితి అర్థంచేసుకోవాలి. సీఎం జగన్, భరత్ అనే నేను సినిమాను నాలుగైదు సార్లు చూసినట్టు ఉన్నారని, అందుకే ఈ ఫైన్లు పెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆ సినిమా చూసినప్పుడు మాత్రం చప్పట్లు కొడతారు. ఈరోజు జగన్ అదే పని చేస్తే విమర్శిస్తున్నారు." అని అన్నారు పేర్ని నాని.
కేవలం ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించే వాళ్లపై ఉక్కుపాదం మోపడం కోసమే ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు నాని. ముఖ్యమంత్రి జగన్ కు ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రోడ్లు సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: