పోలవరం ప్రాజెక్టు నిర్మాణ భవిష్యత్ ?

NAGARJUNA NAKKA
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుపై సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ పెద్దల వాదన మరోలా ఉంది. వాస్తవ అంచనాలకు అనుగుణంగానే నిధుల విడుదల ఉందంటూ బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఈ పరిణామాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారనుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
పోలవరం ఏపీకి జీవనాడి లాంటి ప్రాజెక్టు.  రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని రాజకీయాలు.. కేంద్రం దోబుచూలాటతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పరిస్థితేంటనే ఆందోళన అన్ని వర్గాల్లోనూ మొదలైంది. డీపీఆర్‌-2 ప్రకారం కాకుండా, 2014 అంచనాలకే కట్టుబడి..అప్పటి లెక్కల ప్రకారమే నిధులను విడుదల చేస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పేసింది. దీంతో ఈ ఎపిసోడ్ను ఓ కొలిక్కి తెచ్చేందుకు జగన్ సర్కార్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ఇందులో  భాగంగా ఢిల్లీకి ఇరిగేషన్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులను పంపుతోంది. డీపీఆర్‌-2కు ఆమోదం తెలపాలని.. లేకుంటే ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకమవుతోందనే దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం జగన్ సూచించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకుంటామన్నా అభ్యంతరం లేదనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ ప్రతిపాదనపై కేంద్రం ఎలా రియాక్ట్‌ అవుతుందనేది సస్పెన్స్‌గా మారింది.
మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ఏపీ బీజేపీ నేతలు కూడా కేంద్రం వైఖరికి అనుగుణంగానే మాట్లాడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందనే విషయాన్ని  కంప్లైంట్‌ చేశామంటున్నారు బీజేపీ నేతలు. అలాగే వాస్తవ అంచనాలకు ఆధారంగానే పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల ఉంటుందని స్పష్టంగా చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏ మాత్రం తేడా జరిగినా.. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల విషయంలో వేసుకున్న అంచనాలు, రూపొందించుకున్న ప్రణాళికలు నిష్ఫలంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. రాయలసీమలో జలకళను సంతరించుకుంటాయి. కానీ ప్రస్తుత పరిణామాలు అందరిలోనూ ఆవేదన కలిగిస్తున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: