అమెరికాలో ఏమైనా జరుగవచ్చు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్.. అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కన్నా ప్రజాదరణలో ముందున్నారని ఇటీవలి పోల్ సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా కీలకమైనవిగా భావించే రాష్ట్రాలలో కూడా బైడెన్‌కు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నట్లు తేలింది. ఫండ్ రైజింగ్ కార్యక్రమాల నుంచి డెమోక్రాట్లకు రికార్డు స్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి. అంతా సానుకూలంగా కనిపిస్తున్నా.. డెమొక్రాట్లలో ఆందోళన కూడా ఉంది. నాలుగేళ్ల కిందట తమ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌కు కూడా ఇదే తరహాలో మద్దతు లభించింది. ఆమె గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ చివర్లో ఫలితం మారిపోయింది. మరోసారి చరిత్ర పునరావృతం అవుతుందా అనే సందేహం డెమోక్రాట్లను పట్టి పీడిస్తోంది.
అమెరికన్ ఓటర్లు దేనికి ప్రాధాన్యం ఇస్తారు?. ఇస్తున్నారు అనేది ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశం. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికన్ సమాజంలో స్పష్టమైన చీలిక కనిపించింది. నల్ల జాతీయుల మీద జరిగిన దాడులు, నల్ల జాతీయులకు మద్దతుగా జరిగిన ఉద్యమాలు... ఎన్నికల్ని ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువ. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్‌ను రంగంలోకి దింపడానికి ఆమె తెలివి తేటలతో పాటు ఆమెకున్న మల్టీ కల్చరల్ బ్యాక్‌గ్రౌండే కారణం అనేది ఎవరూ కాదనలేని అంశం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్ల మనస్తత్వం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే జరుగుతోంది. గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతిచ్చేవారు ఎవరు అన్న అంశంలో పెద్దపెద్ద ఎన్నికల పండితుల అంచనాలు కూడా తప్పాయి. బైడెన్‌కు ఇప్పుడున్న మద్దతునుబట్టి చూస్తే 2016లో ఆ పార్టీకి ఏర్పడిన పరిస్థితి ఈసారి ఎదురు కాకపోవచ్చన్నది ఒక అంచనా. అమెరికాలో ఇప్పుడు చాలామంది పోస్టల్ ఓటుకే మొగ్గు చూపుతున్నారు. ఇందులో అవకతవకలు జరిగే అవకాశముందని, తేడా వస్తే తాము దీన్ని సవాల్ చేస్తామని రిపబ్లికన్‌లు ఇప్పటికే తేల్చి చెప్పారు.