జగనన్న తోడుపై.. ప్రజల్లో అసంతృప్తి ఉందా..?

Deekshitha Reddy
నవరత్నాల పథకాల్లో భాగంగా సీఎం జగన్ అమలు చేసిన అన్ని పథకాలపై ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మఒడి, రైతు భరోసా.. లాంటి ఏ పథకంలో అయినా నేరుగా నగదు బదిలీ జరిగిపోతోంది. అయితే తాజాగా జగనన్న తోడు కార్యక్రమంపై మాత్రం కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అసలేంటి ఈ పథకం?
ఫుట్‌పాత్‌లు, వీధుల్లో వస్తువులు, తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందించే కార్యక్రమమే ‘జగనన్న తోడు’. ఈ పథకాన్ని ఈ నెల 6వ తేదీనుంచి సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతోపాటు ఆ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఇప్పటి వరకూ వడ్డీతోపాటు అసలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని అనుకున్నారు వ్యాపారులు. కొన్ని ప్రాంతాల్లో అలా ప్రచారం కూడా జరిగింది. దీంతో చిరు వ్యాపారులంతా తమకి వచ్చే 10 వేల రూపాయలు నగదు సాయం కింద భావించారు. బ్యాంకులతో రుణం ఇప్పించినా ఆ మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఆశపడ్డారు. తీరా ప్రభుత్వం వడ్డీ మాత్రమే చెల్లిస్తుందని, అసలు వ్యాపారులే వాయిదాల పద్ధతిలో చెల్లించాలని చెబుతుండే సరికి ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

అయితే ప్రభుత్వం మాత్రం ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు పూర్తి స్థాయిలో లబ్ధి పొందుతారని చెబుతోంది. 10వేల ఆర్థిక సాయం ఇప్పించడంతోపాటు, వడ్డీ చెల్లించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని, కేవలం రుణాన్ని వడ్డీ లేకుండా వాయిదాల్లో కట్టుకోవడమే వ్యాపారులు చేయాల్సిన పని అని అంటున్నారు. వ్యాపారంలో లాభం, నష్టం బేరీజు వేసుకునే వెసులుబాటు దొరుకుతుందని, అందుకే అసలు కట్టే బాధ్యత వ్యాపారులపైనే పెట్టామని చెబుతున్నారు. ఒకవేళ చిరు వ్యాపారులకు రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదురైతే.. వెంటనే స్థానిక సచివాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: