సచివాలయ ఉద్యోగం మిస్ అయ్యారా..? అయితే ఇది మీకోసమే..

Deekshitha Reddy
రాష్ట్రంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేపట్టనంత భారీ స్థాయిలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే సీఎం జగన్ సచివాలయ పోస్ట్ లు భర్తీ చేశారు. దాదాపుగా లక్షన్నర మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలతో లబ్ధి పొందారు. సొంత జిల్లాలోనే ఉపాధి దొరకడంతో ఉద్యోగాలు పొందిన వారి ఆనందానికి అవధులు లేవు. అయితే ఒకటీ అరా మార్కులతో సచివాలయ ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది తీవ్ర నిరాశకు లోనయ్యారు. మళ్లీ ఇప్పట్లో అంత భారీ నోటిఫికేషన్ పడదేమోనని ఆందోళన పడుతున్నారు. అటు వాలంటీర్ ఉద్యోగాలు చేయలేక, ఇటు సచివాలయ పోస్ట్ రాక.. సతమతమవుతున్నారు. అలాంటి వారికి ఏపీ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పింది.

రాష్ట్రంలో మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వాటి ద్వారా సుమారు 39 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. పరోక్షంగా మరో లక్షమందికి ఉపాధి మార్గం దొరికినట్టవుతుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం జగన్ మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకి ఆమోదం తెలిపారు. ఇంటెలిజెంట్‌ సెజ్‌, అదానీ డేటా సెంటర్‌, ఏటీసీ టైర్ల పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఖరారయ్యాయి. పరిశ్రమలు కోరుతున్న రాయితీలు, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. కాలుష్య రహిత పరిశ్రమలకే విశాఖలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ ఏపీ ప్రై లిమిటెడ్‌ హైవే టైర్ల తయారీ సంస్థ రూ.980 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడింది. దీని ద్వారా 2వేల మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖలోని మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ బిజినెస్‌ పార్కు, రిక్రియేషన్‌ సెంటర్‌తో పాటు స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయనుంది. వాటి ద్వారా రూ.14,634 కోట్ల పెట్టుబడులను సంస్థ పెట్టనుంది. సుమారు 24,990 మందికి ఉపాధి కల్పిస్తుంది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో అపాచీ సంస్థకు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ లిమిటెడ్‌ ఏర్పాటు అవుతోంది. రెండుదశల్లో రూ.700 కోట్ల పెట్టుబడి తో వస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఇదే సంస్థ కడపజిల్లాలోనూ మరో సెజ్‌ ఏర్పాటుచేసి, 2వేల మందికి ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.
మరో మూడు పరిశ్రమలపై కూడా సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రైవేట్ సెక్టార్ లో భారీగా ఉద్యోగాల భర్తీ మొదలు కాబోతోంది. మంచి వేతనాలతో ఈ  పోస్ట్ లు ఉంటాయి కాబట్టి.. ఏపీలోని నిరుద్యోగులకు ఇది నిజంగానే పెద్ద గుడ్ న్యూస్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: