అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయంచేస్తామంటూ ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. వారికి చెల్లించేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించారు. ముందుగా 10వేల రూపాయల లోపు డిపాజిట్లు చేసినవారికి చెల్లించేందుకు నిధులు విడుదల చేశారు. అయితే అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్ట్ పరిధిలో ఉండటంతో.. వెంటనే ఈ చెల్లింపులు జరగలేదు. కోర్టు విచారణ నేపథ్యంలో చెల్లింపు ఆలస్యం అవుతూనే ఉంది. అయితే ఇప్పటికి ఈ వ్యవహారంలో ఓ కదలిక వచ్చింది.
అగ్రి గోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసి నష్టపోయిన వారికి న్యాయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019–20 బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించింది. ఈ డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని తాజాగా ఏపీ అడ్వొకేట్ జనరల్ తెలంగాణ హైకోర్టును అభ్యర్థించారు. అగ్రి గోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలని, ఆ సంస్థపై సీబీఐ దర్యాప్తు కోరుతూ 2015లో ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతివాదులుగా ఉన్న నేపథ్యంలో ఈ కేసు తెలంగాణ హైకోర్ట్ పరిధిలోనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో.. డబ్బు పంపిణీకి అనుమతి ఇవ్వడంతోపాటు మార్గదర్శకాలను జారీ చేయాలని ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలంగాణ హైకోర్ట్ ని అభ్యర్థించారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారమే డిపాజిటర్లను గుర్తించి డబ్బు పంపిణీ చేస్తామని తెలిపారు.
డబ్బు పంపిణీకి అనుమతి కోరుతూ 2019 డిసెంబర్లోనే ఏపీ ప్రభుత్వం తరపున రెండు పిటిషన్లు దాఖలు చేసిన విషయాన్ని కూడా ఏజీ గుర్తు చేశారు. మరోవైపు తాము దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను విచారించాలని బాధితుల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో ఈనెల 9న ఈ పిటిషన్లను విచారించేందుకు ధర్మాసనం అనుమతించింది. అంటే బాదితులకు డబ్బుల పంపిణీ విషయంలో ఈనెల 9న ఓ క్లారిటీ వస్తుందని అంచనా వేయొచ్చు. కోర్టు అనుమతిస్తే.. ఏపీలోని అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు తిరిగి అందే అవకాశం ఉంది. అగ్రి గోల్డ్ సంస్థ 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి మొత్తం రూ.6,380 కోట్లు సేకరించి మోసం చేసింది. వీరిలో తొలి దఫా 10వేలలోపు డిపాజిట్లు చేసినవారిని ప్రభుత్వం ఆదుకోవాలని చూస్తోంది.