ప్రాజెక్ట్ పనుల్లో వేగం..!

NAGARJUNA NAKKA
పోలవరం పనుల్లో ఏపీ సర్కార్ వేగం పెంచింది. ప్రాజెక్టు అనుకున్న సమయానికే పూర్తి చేయాలన్న ధృడ సంకల్పంతో ఉన్న ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఓ వైపు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు పనుల్లో వేగం పెంచింది.  

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలనేది జగన్ ప్రభుత్వం లక్ష్యం. వరదల కారణంగా కొంత ఆలస్యమైతే.. కరోనా కారణంగా పనులన్నీ నిలిచిపోవడంతో ఇంకొంత కాలం జాప్యం అయింది. పోలవరం నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం రెండంచెల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఓ వైపు నిత్యం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు పనుల్లో ఏ మాత్రం వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్రం మళ్లీ మాట మార్చదనే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. ముందు జాగ్రత్తగా కొన్ని అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ. ఓ విధంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఫిక్స్ చేసే దిశగా వాదనలను సిద్దం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

భవిష్యత్తులో పోలవరం అంచనాల విషయంలో కేంద్రం ఏదైనా మెలిక పెడితే దానికి గట్టిగా సమాధానం ఇచ్చేందుకు  కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.  2013-14 అంచనాల ప్రస్తావన తెస్తే.. మూడో రివైజ్డ్ కాస్ట్ కమిటీ వేయాలనే డిమాండ్‌ను తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ డిమాండ్‌ను ఇటీవల జరిగిన పీపీఏ భేటీలో వినిపించినట్టు తెలుస్తోంది.  మూడో రివైజ్డ్ కాస్ట్ కమిటీ వేస్తే పోలవరం అంచనా వ్యయం 55 వేల కోట్ల రూపాయల నుంచి మరో పది వేల కోట్ల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందంటున్నాయ్‌ ఇరిగేషన్‌ వర్గాలు.

ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల కారణంగా స్పిల్ వేలో 4 టీఎంసీల వరకూ నీరు నిలిచి ఉండటంతో ఈ పనులు ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. నవంబరు 15 నుంచి స్పిల్ ఛానల్ లో నిలిచి ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను చేపట్టనున్నారు.  తర్వాత స్పిల్ ఛానల్ లో కాంక్రీటు, మట్టితవ్వకం పనులు ప్రారంభం కానున్నాయి.  వరదల కారణంగా దెబ్బ తిన్న ఎగువ కాఫర్ డ్యామ్ మరమ్మత్తుల పనులు కూడా చేపట్టారు. మొత్తానికి  ఓవైపు కేంద్రంతో లాబీయింగ్.. కొర్రీలు వేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు.. పనుల్లోనూ వేగం పెంచడం ద్వారా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: