అనుమతి వచ్చేసింది.. ఇక నిర్మాణంపైనే చూపు..!
2008లో శంకుస్థాపన జరిగిన బందరు పోర్టు.. ఎన్నో మలుపుల తర్వాత ఎట్టకేలకు నిర్మాణానికి నోచుకుంటోంది. ప్రభుత్వం సూచించిన సవరణలతో 5 వేల 835 కోట్ల రూపాయల అంచనాతో డీపీఆర్ రూపొందించిన రైట్స్ సంస్థ.. 36 నెలల్లో పనులు పూర్తి చేయాలని గడువు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా వెయ్యి కోట్లు కేటాయించనుండగా.. మిగిలిన నిధులు ఏపీ మారిటైమ్ బోర్డు సమీకూర్చుకోవాల్సి ఉంటుంది. పోర్టు నిర్మాణానికి మారిటైం బోర్డు త్వరలోనే టెండర్లు ఆహ్వానించనుండగా.. నిర్మాణ బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోనుంది.
బందరు పోర్టు నిర్మాణానికి ప్రైవేట్ భూములు సేకరించబోమని, ప్రభుత్వ భూముల్లోనే నిర్మిస్తామని గత ఎన్నికల సమయంలో సీఎం జగన్ చెప్పారు. పోర్టు ప్రాంతంలో 2 వేల 360 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. మరో 654 ఎకరాల అసైన్డ్ భూములు ఉండగా.. గత ప్రభుత్వం 700 ఎకరాలను సమీకరించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్న భూముల్లోనే పోర్టు నిర్మాణం చేపడుతుందా? లేక మరికొంత భూమిని సేకరిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
తొలి దశలో ఆరు బెర్తులతో బందరు పోర్ట్ నిర్మాణం ఉంటుంది. నాలుగు జనరల్ కార్గో బెర్తులు, ఒక కోల్ బెర్త్, ఒక కంటైనర్ బెర్తుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 80 వేల డెడ్ వెయిట్ టన్నేజ్ కెపాసిటీ గల షిప్పులు వచ్చేందుకు అనువుగా బెర్తులు నిర్మిస్తారు. పోర్టులో గోడౌన్లు, అంతర్గత రోడ్లు, ఇంటర్నల్ రైల్ యార్డ్, సబ్ స్టేషన్, పరిపాలనా భవనం వంటి నిర్మాణాలూ చేపడతారు.