ట్రంప్ లో టెన్షన్ పెరిగిపోతుందా..?
జార్జియా, పెన్సిల్వేనియాల్లో నిన్నటి వరకు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న ట్రంప్ కౌంటింగ్ చివరి దశకు చేరుకున్నాక వెనకబడ్డారు. ఫలితంగా బైడెన్, ట్రంప్ మధ్య తేడా ఒక్క శాతం కంటే తక్కువకు వచ్చింది. జార్జియాలో పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. ఇక్కడ ఇద్దరికి 49.4శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఫుల్‌టోన్ కౌంటీలో దాదాపు 20వేల ఆబ్సెంట్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. వీటిల్లో 8,351 నిన్న రాత్రి రాగా.. బైడెన్‌కు ఏకంగా 6,410 ఓట్లు లభించాయి. ట్రంప్‌కి 1,941 ఓట్లు మాత్రమే వచ్చాయి. లెక్కింపు జరిగే కొద్దీ ట్రంప్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది.
పెన్సిల్వేనియాలో పోస్టల్ ఓట్లు లెక్కించే కొద్దీ ట్రంప్ ఆధిపత్యం కరిగిపోతోంది. నిన్నటి వరకు ట్రంప్ ఇక్కడ ఒకశాతానికి పైగా ఆధిపత్యంలో ఉండగా.. ఇప్పుడు అది 0.4శాతానికి తగ్గిపోయింది. పెన్సిల్వేనియాలో పోస్టల్ బ్యాలెట్లు అత్యధికంగా డెమొక్రాట్లవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం మెయిల్ బ్యాలెట్లలో 60శాతం నుంచి 90శాతం వరకు ఓట్లు బైడెన్ పక్షానికే వస్తున్నట్లు అంచనా. దీంతో ట్రంప్ ఆధిక్యం 26వేలకు పడిపోయింది.
రిపబ్లికన్లు తమ మద్దతుదారులను బూత్‌కు వచ్చి ఓటు వేయడాన్ని ప్రోత్సహించారు. కరోనా కారణంగా డెమొక్రాట్లు తమ మద్దతుదారులను పోస్టల్ ఓట్లవైపు ప్రోత్సహించారు. అందుకే ఈ ఏడాది పోస్టల్ బ్యాలట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తొలుత బూత్కువచ్చి ఓటింగ్ చేసిన ఓట్లను కౌంట్ చేయడంతో చాలా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కనిపించింది. పోస్టల్ లెక్కించే కొద్దీ ఆయన ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. జార్జియా, పెన్సిల్వేనియాలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.