దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ కు సర్వం సిద్ధం..!

NAGARJUNA NAKKA
దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. పార్టీలన్నీ గెలుపు గుర్రాలు ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నాయి. గతం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని అధికా పార్టీ ధీమాతో ఉంటే.. ఈ సారి సత్తా చాటుతామని ప్రతిపక్షాలు అంటున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 లో ఏర్పడింది దుబ్బాక నియోజవర్గం. అంతకు ముందు దొమ్మాట నియోజవర్గంలో భాగంగా ఉండేది. మొదట్నుంచీ ఈ నియోజవర్గంలో ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి నాలుగు సార్లు, సోలిపేట రామలింగా రెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు. ఐదుసార్లు నియోజక వర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరగా , టీడీపీకి నాలుగు సార్లు పట్టం కట్టారు ప్రజలు. టీఆర్‌ఎస్‌ పార్టీని కూడా నాలుగు సార్లు ఆదరించారు.  ఒక సారి పీడీఎఫ్, మరొక సారి ఇండిపెండెంట్ అవకాశం ఇచ్చారు దుబ్బాక ప్రజలు.

ఉద్యమం సమయం నుంచి టీఆర్ఎస్‌కి పట్టున్న  నియోజకవర్గాల్లో  దుబ్బాక ఒకటి.  అవిర్బావం తర్వాత 2009 లో మాత్రమే ఇక్కడ ఆ పార్టీ ఓడింది. 2009 లో ఏర్పడి మహాకూటమి పొత్తు లో భాగంగా ఈ సీటును టీ ఆర్ ఎస్ కి కేటాయించింది టీడీపీ. దీంతో అప్పటి దాకా టీడీపీ ముత్యం రెడ్డి కాంగ్రెస్ లో చేరి.. ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామలింగారెడ్డి 37వేల 925 మెజార్టీతో గెలిచారు. 2018లో టీఆర్ఎస్ కి 89వేల 299 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 26వేల 799 ఓట్లు, బీజేపీ కి 22వేల 595 ఓట్లు వచ్చాయి. 62వేల 500 మెజారిటీతో మరోసారి రామలింగారెడ్డి గెలిచారు.

నియోజవర్గం లో మొత్తం 7మండలాలు ఉండగా.. అందులో 5 సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నాయి. రెండు మండలాలు మెదక్ జిల్లా పరిధిలోకి వస్తాయి. దుబ్బాక గ్రేడ్ 2 మున్సిపాలిటీ గా ఉండగా.. నియోజక వర్గం పూర్తిగా రూరల్ ఏరియాగా ఉంటుంది. ఇక్కడ జనం వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నారు. బీడీ కార్మికులు, చేనేత కార్మికులు కూడా ఎక్కువే. బీసి ఓటర్లు ఎక్కువ ప్రభావం చూపుతారు, అందులో ముది రాజ్ ఓటర్లు కీలకం. అయితే, ఎక్కువ సార్లు రెడ్డి సామాజిక వర్గానికే ప్రాతినథ్యం దక్కడం విశేషం.

రేపు జరిగే కౌంటింగ్‌పైనా ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. మరోసారి గులాబీ జెండా ఎగురుతుందా? లేక ప్రతిపక్షాలు ప్రభావం చూపిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడినట్టు కనిపిస్తోంది. దీంతో ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: