అంతా అయిపోయాక మీ గోలెంటయ్యా..?

అసలు తెలుగు తమ్ముళ్లు అంటే క్రమశిక్షణకు మారుపేరు అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పదేపదే చెబుతూ ఉంటారు. ఆ విధంగా చంద్రబాబు పార్టీని క్రమశిక్షణలో పెడుతూనే వచ్చారు. అయితే గత కొంత కాలంగా ఆ పార్టీలో చంద్రబాబు ను సైతం లెక్క చేసేవారు తగ్గిపోయారు అంటే అతిశయోక్తి కాదు. టిడిపి ప్రభుత్వంలో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, అనేక వ్యవహారాలు చేయడం, దాని కారణంగా టిడిపి ప్రభుత్వం కావలసినంత అపఖ్యాతి మూటగట్టుకున్న వంటి వ్యవహారాలు ఎన్నో జరిగిపోయాయి. చివరకు ఫలితాల దగ్గరకు వచ్చే సరికి ఆ ప్రభావం కనిపించింది. 


ఇదిలా ఉంటే 2019 ఎన్నికలలో టిడిపి ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఇళ్లకే పరిమితమైంది. పార్టీలో ఉత్సాహం లేదు. వైసీపీ ప్రభుత్వం ఎక్కడ టార్గెట్ చేసుకుని వేధింపులకు గురి చేస్తుందని భయం తో సైలెంట్ అయిపోయారు . పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వంపై పోరాడాలి అని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినా, వాటిని పట్టించుకునే వారు కూడా కరువయ్యారు. దీంతో పార్టీలో ఉత్సాహం తీసుకువచ్చేందుకు కొత్తగా కమిటీల నియామకం చేపట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ కమిటీలు ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో అంటే వందల సంఖ్యలో నాయకులతో కమిటీలను వేశారు. ఇక ఎక్కడా అసంతృప్తులు ఉండరు అని, అంతా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని బాబు భావించారు. 


అయితే పదవులు దక్కని వారిలోనూ, అసంతృప్తి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తమ స్థాయికి తగ్గ పదవి తమకు కట్టబెట్టలేదని, తమకంటే జూనియర్ లు మంచి పదవులు సంపాదించారని, పార్టీ కోసం కష్టపడినా, మొక్కుబడిగా తక్కువస్థాయి పదవులు ఇచ్చారని సీనియర్లు అలక బూనారు. ఇక పదవులు దక్కని వారు ,తాము పార్టీ కోసం ఎంత చేసిన బాబు గుర్తించలేదని, పార్టీలో చేరిన వారికి కూడా కీలక పదవులు కట్టబెట్టారని, పార్టీలో కష్టపడే వారికి విలువ లేదు అంటూ కొంతమంది రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతున్నారు. అయితే ఈ కమిటీల తో నాయకులకు కలిసి వచ్చేది ఏమైనా ఉందా అంటే ఏమి లేదని చెప్పాలి.



 ఎందుకంటే కేవలం వైసీపీ ప్రభుత్వం పై పోరాడుతారు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా పదవులు ఇచ్చి నాయకులను యాక్టివ్ చేశారు తప్పితే, పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదు. అందులోనూ లోకేష్ కు అనుకూలంగా ఉండే వారితో భర్తీ చేసినట్లు కనిపిస్తోంది.ఇక ఈ కమిటీలు వ్యవహారం అంతా ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా అలక బూనినా, హడావుడి చేసినా, ప్రయోజనం ఏముంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: