స్నేహితులతో బయటికెళ్లిన భర్త.. కానీ తెల్లారేసరికి..?
హత్య ఎవరు చేసి ఉంటారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అటు పోలీసులు కూడా ఈ కేసును సవాల్గా తీసుకుని విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వీకోట మండలం హరిమాకుల పల్లి కి చెందిన రమేష్ రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటినప్పటికీ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామానికి సమీపంలో ఉన్న తోటలో రమేష్ తీవ్ర గాయాలతో అచేతన స్థితిలో పడి ఉన్నాడు అని సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి పరుగులు పెట్టారు.
వెంటనే రమేష్ ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే రమేష్ నీ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. అయితే మృతుడి శరీరంపై తీవ్రంగా గాయాలు ఉండటంతో ఎవరో దారుణంగా హత్య చేశారు అని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే విషయంపై అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే స్నేహితులతో సరదాగా వెళ్లిన భర్త చివరికి విగతజీవిగా మారిపోవడంతో భార్య కన్నీరుమున్నీరైంది. కాగా ఈ కేసులో వివిధ కోణాలలో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.