సొంత పార్టీపై ఓ రేంజ్ లో ఆగ్రహం..!

NAGARJUNA NAKKA
హస్తం పార్టీ ఇక ముందు ప్రజలకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.. ఈ మాటన్నది కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు కాదు. సాక్షాత్తూ కరడు కట్టిన కాంగ్రెస్ వాది కపిల్‌ సిబల్. హైకమాండ్‌కు అత్యంత ప్రియమైన నేతగా గుర్తింపు పొందిన ఆయనకు ఇంతటి ఆగ్రహం ఎందుకు వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

పార్టీలో సమూల ప్రక్షాళన అవసరం.. చర్యలు తీసుకోండి అంటూ సీడబ్ల్యూసీ భేటీకి ముందు ఆ మధ్య హైకమాండ్‌కు లేఖ రాశారు 23మంది కాంగ్రెస్ నేతలు. వారిలో కపిల్ సిబల్ కూడా ఉన్నారు. లేఖ రాసిన నేతలంతా బీజేపీకి తొత్తులు అంటూ అప్పట్లో ఆరోపణలు రావడంతో.. కపిల్ సిబల్ ఆగ్రహంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేను పార్టీ కోసం ఏం చేశానో తెలుసుకోండి. సంఘ్ పరివార్ శక్తుల మీద ఎప్పటి నుంచో పోరాడుతున్నా అంటూ సిబల్ సోషల్ మీడియాలో పోస్ట్  చేయడం, రాహుల్ గాంధీ ఆయనతో మాట్లాడటం.. ఆ తర్వాత కాసేపటికే దాన్ని తొలగించడం జరిగింది. ఇదంతా గతం.

ప్రస్తుతానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని ప్రజలు అనుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిన తీరు చూస్తే.. కాంగ్రెస్‌  దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదని సిబల్‌ అభిప్రాయపడ్డారు. టెన్ జన్‌పథ్‌లో ఉన్న వాళ్లు అంతా బావుందని అనుకుంటున్నారని..  పార్టీని అన్ని స్థాయిల్లో ప్రక్షాళన చేయాలని సూచించారు.

గుజరాత్‌లో జరిగిన ఉపఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలవలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు కపిల్ సిబల్. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని.. యూపీ ఉప ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి రెండు శాతం కంటే తక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఆరేళ్లుగా ఆత్మపరిశీలన చేసుకోలేని కాంగ్రెస్‌.. ఇకపై చేసుకుంటుందని ఎలా ఆశించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక పాత్ర పోషించే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నామినేటెడ్‌ బాడీ కావడమే పార్టీ దుస్థితికి కారణమని సిబల్‌ విశ్లేషించారు. సిబల్ వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం ఎలా స్పందింస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: