టీమిండియాకు తొలగిన అడ్డంకులు..!
గత రెండు నెలలు యూఏఈలో నెమ్మది పిచ్‌లపై ఆడిన భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా పిచ్‌లకు అలవాటు పడేలా శ్రమిస్తున్నారు. ఆసీస్ పిచ్‌లపై వచ్చే షార్ట్ బంతుల్ని ఎదుర్కొనే విధంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బౌన్సర్లపై ప్రత్యేక దృష్టి సారించి చెమటోడుస్తున్నాడు. అతడికి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సాయం చేస్తున్నాడు. 22 గజాలకు బదులుగా 18 గజాల నుంచి అశ్విన్ రాకెట్‌తో టెన్నిస్ బంతుల్ని సంధిస్తుండగా వాటిని పుల్‌షాట్స్‌తో రాహుల్ ఎదుర్కొంటున్నాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆస్ట్రేలియా గడ్డపై లిమిటెట్ క్రికెట్లో టీమిండియాకు ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే భారత క్రికెటర్లందరూ ఐపీఎల్లో సత్తా చాటి ఫామ్‌లో ఉన్నారు. అయితే 14 రోజుల క్వారంటైన్ మానసికంగా దెబ్బతీసే అవకాశం ఉంది. మరోవైపు తొలి టెస్టుపై కరోనా మేఘాలు కమ్ముకున్నాయి. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌తో సహా కొందరు సభ్యులు ఇప్పుడు హోం క్వారంటైన్లోకి వెళ్లారు. దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా వ్యాపిస్తుండడం వల్ల వైద్యాధికారుల సూచన మేరకు వీరంతా ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇటీవల దక్షిణా ఆస్ట్రేలియాలో జరిగిన షీఫెల్డ్ షీల్డ్ టోర్నీలో టిమ్ పైన్, మాథ్యూ హెడ్, ఇతర టెస్టు జట్టు ఆటగాళ్లు ఆడారు. వీరంతా టాస్మానియా టైగర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే అక్కడ కరోనా వ్యాప్తి పెరగడంతో తిరిగి స్వస్థలాలకు వచ్చినా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని సూచించారు అధికారులు.