వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు !

NAGARJUNA NAKKA
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రకటించింది ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్. పంచాయితీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని.. వాటి నిర్వహణకు ఎలాంటి న్యాయ పరమైన ఇబ్బందులు లేవని.. ఎస్ ఈసీ రమేష్ కుమార్ ప్రభుత్వానికి పంపిన ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.  ఎస్ ఈసీ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది.
కోవిడ్‌ కారణంగా ఏపీలో వాయిదా పడిన స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. 2021 ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికల నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ప్రభుత్వానికి సమాచారం పంపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా డీజీపీ ఇతర విభాగాలకు ఈ సమాచారాన్ని తెలియచేస్తూ ప్రోసీడింగ్సును ఎస్ఈసీ నుంచి అధికారికంగా పంపారు.
ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రభుత్వానికి పంపిన ప్రోసీడింగ్సులో స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టిందని.. రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య 10వేల నుంచి 753కి తగ్గిందన్నారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదలైందని ఎస్‌ఈసీ ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని.. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు కోడ్‌ అమల్లోకి వస్తుందని ఎస్ ఈసీ స్పష్టం చేసింది.
ప్రభుత్వ అభ్యంతరాలపైనా ఎస్‌ఈసీ వివరణ ఇస్తున్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉప ఎన్నికలు కూడా జరిగాయని ఎస్ఈసీ ప్రభుత్వానికి పంపిన ప్రోసీడింగ్సులో పేర్కోన్నారు. రాష్ట్రంలోని 11 రాజకీయ పార్టీలు సూచన ప్రాయంగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగానే అభిప్రాయాలను తెలియచేసినట్టు ఎస్ఈసీ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగపరంగా చూసినా స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇంకా వాయిదా వేయడం సరికాదంటోంది ఎన్నికల సంఘం.
సుమారు పది వేలకు పైగా ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దం కావాల్సిందిగా ప్రోసిడింగ్స్ జారీ చేసిన ఎస్ఈసీ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావించలేదు. ఈ క్రమంలో ఎస్ఈసీ జారీ చేసిన ప్రోసీడింగ్స్ విషయమై ప్రభుత్వం మండిపడుతోంది. ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ చూస్తుంటే టీడీపీకి కొమ్ము కాస్తోన్నట్టుగానే ఉందనే విమర్శలు అధికార పార్టీ వైపు నుంచి వస్తున్నాయి.
 ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా మారిన వ్యవహరం మరింత ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతున్న సమయంలో ఈ తరహా వ్యవహారాలు ఎస్ఈసీ స్థాయికి తగదనే భావన ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. మరోవైపు పక్క రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహిస్తుంటే.. ఏపీలో ఎందుకు నిర్వహించకూడదంటున్నాయి ప్రతిపక్షాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: