కరోనా కేసులతో అల్లాడుతున్న ఢిల్లీ !

NAGARJUNA NAKKA
దేశ రాజధాని కరోనా కేసులతో అల్లాడుతోంది. దీంతో ఢిల్లీ సర్కారు అనేక కఠిన చర్యలు తీసుకుంది. అత్యవసరం లేని శస్త్ర చికిత్సలను నిలిపివేసి.. కోవిడ్ పేషంట్లకు బెడ్లు కేటాయించాలని నిర్ణయించింది. మాస్క్ పెట్టుకోకపోతే విధించే జరిమానాను 500 నుంచి రెండు వేల రూపాయలకు పెంచింది. ప్రైవేట్ ఆసుపత్రులు ఐసీయూ బెడ్లలో 80 శాతం, సాధారణ బెడ్లలో 60 శాతం కరోనా రోగులకు కేటాయించాలని ఆదేశించింది.

ప్రజల ఆరోగ్యంతో రాజకీయాలు చేయడం తగదన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. చాత్ పండగపై ఆంక్షలు విధించడాన్ని ప్రత్యర్థులు రాజకీయం చేస్తున్నారని.. ఇది మంచిది కాదని సూచించారు. కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్ణయించారు. ఈ సమావేశానికి వివిధ పార్టీ నేతలు హాజరయ్యారు. చాత్‌ పండగను అడ్డం పెట్టుకుని తమ సర్కారుపై చేస్తున్న విమర్శల్ని ఖండించారు. మాస్క్ లేకుండా ఎవరు బహిరంగంగా తిరిగినా వారికి 2000 రూపాయల జరిమానాను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.

ఢిల్లీలో కరోనాతీవ్రంగా విజృంభిస్తోందని.. పండగలపై ప్రభుత్వం నిషేధం విధించలేదని కేజ్రీవాల్ తెలిపారు. చెరువు, నది ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడడాన్ని మాత్రమే నిషేధించామని స్పష్టం చేశారు. పండగలను ప్రజలంతా ఇళ్లలోనే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ విస్తరించకుండా మార్కెట్లను మూసివేయాలన్న ఆప్‌ సర్కారు నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచాలని సూచించింది బీజేపీ.

కరోనా కారణంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు ప్రకటించారు. కర్ఫ్యూ నిబంధనలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. దసరా, దీపావళి, చాత్‌ పండగల్ని ప్రజలు గుంపులు గుంపులుగా చేసుకోవడం వల్లనే కరోనా కేసులు పెరిగాయనేది నిపుణుల విశ్లేషణ. మొత్తానికి కరోనా మహమ్మారి దేశ రాజధానిలో విజృంభిస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: