ఆ ఒక్క నిర్ణయంతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందా..?

Deekshitha Reddy
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్ ప్రజలపై వరాజల జల్లు కురిపిస్తోంది. మంచినీటి కుళాయి బకాయిల రద్దునుంచి.. వృద్ధులకు ఉచిత బస్ పాస్ ల వరకు అన్నీ ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ గ్రేటర్ మేనిఫెస్టో చూస్తే ప్రపంచంలోనే సుందర నగరంగా హైదరాబాద్ ని మార్చేయబోతున్నారా అనిపిస్తోంది. అయితే మేనిఫెస్టోలో లేకపోయినా.. అదను చూసి ప్రజలకు ఓ వరాన్ని ఇచ్చేశారు కేసీఆర్.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ సర్వీసుల్ని పెంచుతూ టీఆర్ఎస్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జంటనగరాల మధ్యతరగతి, పేద ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే. లాక్ డౌన్ తర్వాత ఇన్నాళ్లూ ఆటోలతో పాట్లు పడిన ప్రజలకు ఇకపై ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 శాతం బస్సులు  రోడెక్కాయి. ప్రభుత్వ ఆదేశాలతో నగరంలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సుల  సర్వీసుల సంఖ్య పెంచామని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలో 25శాతం బస్సులు మాత్రమే నడిచాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం బస్సులు తిప్పుతున్నట్లు తెలిపిన గ్రేటర్ ఆర్టీసీ వెల్లడించింది. బస్ పాస్ కౌంటర్లను కూడా 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 నుండి రాత్రి 8.15 వరకు  బస్ పాస్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కరోనా  లాక్ డౌన్ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణాలో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా 25 శాతం మాత్రమే ఆర్టీసీ బస్సులని తిప్పుతున్నారు. కేసుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిందంటూ కేసీఆర్ సర్కార్‌ ఈ బస్సుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య తగ్గడం అనే కారణం చెబుతున్నా.. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాభిమానం పొందేందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా సంతోషకరమైన వార్త. దీంతో టీఆర్ఎస్ గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: