సొమ్ముల వల... ఓట్ల కోసం విలవిల ?

గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం ఆయా పార్టీలు,  ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి, ఎన్నికల ప్రచారానికి ఎంతో సమయం ఇవ్వకపోవడంతో డివిజన్లలోని ఓటర్లను కలవడం పెద్ద తలనొప్పిగా మారింది. అతి తక్కువ సమయంలో ఓటర్లు అందరినీ పలకరించడం సాధ్యం కాకపోవడంతో, కాలనీ లోని ముఖ్యమైన ప్రదేశాల్లోనూ,  కాలనీ కమిటీల తోనూ, ఆ డివిజన్ పరిధిలో ఉన్న కీలకమైన తటస్థ వ్యక్తులను కలుస్తూ , తమకు అండ గా  ఉండాల్సిందిగా కోరుతూ వస్తున్నారు. 



దీనికోసం అభ్యర్థులు గట్టిగానే కష్టపడుతున్నారు. దీనికి తోడు పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని జనాల్లోకి తీసుకువెళ్తూ ప్రచారం చేయడం పైన అభ్యర్థులు దృష్టి పెట్టారు. గెలుపు కోసం అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టి, తామ కే ఓటు వేసే విధంగా చేసుకునేందుకు అన్ని రకాలుగాను తంటాలు పడుతున్నారు. కుల సంఘాలు, మహిళా సంఘాలు, కాలనీ కమిటీలు ఇలా అందరినీ ఉపయోగించుకుంటూ, వీరి ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే నిమిత్తం తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి తమ కుటుంబ సభ్యులను, బంధువులను రంగంలోకి దించి మరి ప్రచారం చేస్తున్నారు. 



ఇక పార్టీ బలహీనంగా ఉన్న చోట కీలక నాయకులు రంగంలోకి దింపి, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, ఆ ప్రాంతంలో రాజకీయ ప్రత్యర్థుల బలం, బలహీనతలు ఏమిటో తెలుసుకుని, వాటిని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ సంఘాల ద్వారా సొమ్ములు రహస్యంగా పంపిణీ చేస్తూ, ఓటర్ల ను తమ వైపు కు తిప్పుకునే ప్లాన్ చేసుకుంటున్నట్లుగానూ వార్తలు వస్తున్నాయి. పోలింగ్ సమయం దగ్గరకు వచ్చేస్తూ ఉండడంతో అన్ని పార్టీలు మరింత అప్రమత్తమైనట్టుగా కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: