గ్రేటర్ యుద్ధం: బీజేపీ స్వయంకృతాపరాథం

Deekshitha Reddy
దుబ్బాక ఫలితంతో అదే ఊపులో జీహెచ్ఎంసీ పీఠం కూడా కైవసం చేసుకోవాలని ఉత్సాహ పడుతున్న బీజేపీ.. వరుస తప్పులు చేస్తోంది. టీఆర్ఎస్, ఎంఐఎం లను టార్గెట్ చేయాలని చూసి.. తనకు తానే టార్గెట్ గా మారింది. శాంతియుతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ ఓవైపు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతల నోటి దురుసు వ్యాఖ్యలు అభ్యర్థులకు తిప్పలు తెస్తున్నాయి.
ఎన్నికల ప్రచారం మొదట్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాయి. వరదల్లో నష్టపోయిన హైదరాబాద్ వాసులకు బండి పోతే బండి, కారు పోతే కారు ఇస్తానన్నారు సంజయ్. అంతే కాదు.. హెల్మెట్ లేకపోయినా, రాంగ్ రూట్ లో వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ అయినా ఆ చలాన్లన్నీ జీహెచ్ఎంసీ కడుతుందని కూడా చెప్పారు. దీన్ని పదే పదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ కేటీఆర్ సంజయ్ ని టార్గెట్ చేశారు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ అలాంటి పిచ్చి వాళ్లని పట్టించుకోవద్దంటూ విమర్శించారు. దీంతో సంజయ్ వ్యాఖ్యలు గ్రేటర్ వాసులకు మరింత సిల్లీగా అనిపించాయి.
పావురాల గుట్ట వ్యవహారంతో రఘునందన్ రావు వైసీపీ నేతలు, కార్యకర్తలకు టార్గెట్ అయ్యారు. వారికి సంజాయిషీ చెప్పుకున్నా కూడా ఫలితం లేకపోయింది. అనవసరంగా వైఎస్ఆర్ మరణాన్ని ప్రస్తావించి దివంగత నేత అభిమానులకు ఆగ్రహం తెప్పించారు. ఆ ఆగ్రహ జ్వాలలు గ్రేటర్ లో బీజేపీ ఓటమికి ఆజ్యం పోస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీని అభిమానించే వారంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటున్నారు. ఇక తాజాగా సర్జికల్ స్ట్రైక్స్ అంటూ మరోసారి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం, అక్కడ పాకిస్తానీ ఓటర్లున్నారు, రోహింగ్యాలున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సంజయ్. దీనిపై కేటీఆర్ మండిపడ్డారు. ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ ఈ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలను ఖండించారు. చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేసే దమ్ములేకే బీజేపీ ఇలా మాట్లాడుతోందని అన్నారు. ఆ దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే బండి సంజయ్ ని పంపించండి అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ.. ఎన్టీఆర్, పీవీ ఘాట్ లపై చేసిిన వ్యాఖ్యలు కూడా సర్జికల్ స్ట్రైక్స్ ముందు తేలిపోతున్నాయి. ఒకరకంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ గెలుపు ఓటముల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయనే ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: