ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!
ఈ మేరకు మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలను చెల్లించేందుకు తక్షణమే తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నెలలో తగ్గించిన వేతనాలను ఈ నెలతో పాటు వచ్చే నెల 2021 జనవరిలో రెండు విడతలుగా చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం వల్ల విధించిన లాక్ డౌన్ల కారణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగుల జీతాలు 50 శాతం తగ్గించి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వ చర్యను ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. వెంటనే 12 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని ఆదేశించిన సంగతి కూడా తెలిసిందే. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా, హైకోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్లు అయింది. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు నిలిపివేసిన జీతాలు తిరిగి చెల్లించాలని నిర్ణయించడం విశేషం. దీనిపై పలువురు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.