గ్రేటర్ యుద్ధం: మేయర్ పీఠం ఎవరిది...? నీదా... నాదా...?

VAMSI
హ హ హ...ఎట్టకేలకు రెండు నెలల నుండి పడుతున్న ఉత్కంఠకు నిన్న తెరపడింది. ముందు నుండి పలు పార్టీల  రాజకీయ నాయకులు  హైదరాబాద్ ప్రజలు మాతోనే ఉన్నారు అంటూ..... మా పార్టీ అంటే మా పార్టీ నే విజయం సొంతం చేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారాలు ఒక ఎత్తైతే... ఎన్నికల ఫలితాలు మరో ఎత్తై నేతల చుట్టూ గిర్రున తిరిగింది. ఎట్టకేలకు జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల సమరం ముగిసింది. ఒక్క నేరెడ్‌మెట్‌ వార్డు మినహా అన్ని వార్డుల ఫలితాలు వెలువడ్డాయి.

కాకపోతే ఊహించని రీతిలో రిజల్ట్ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విమర్శలను పంచుకునే మన నేతలు విజయాన్ని కూడా పంచుకున్నారు. అనుకోని రీతిలో మేయర్ పట్టం ఎవరినీ నేరుగా వరించలేదు. ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ మొదటి స్థానంలో కొలువు తీరగా.... భారతీయ జనతాపార్టీ రెండో స్థానంలో నిలిచింది. నిజానికి ఏ పార్టీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది అన్న మాట వాస్తవం. 2016 ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకే తగిలింది. గతంలో గ్రేటర్‌లో ఆ పార్టీకి  99 స్థానాలు గెలుచుకోగా.. ఈసారి ఆ సంఖ్య 55 కి పడిపోవడం ఆలోచించాల్సిన విషయమే.

ఇక దుబ్బాక విజయంతో దూసుకుపోతున్న బీజేపీ 48 డివిజన్లలో తమ కాషాయ జెండా ఎగురవేసి ఆహా అనిపించుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఊహించని రీతిలో రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అసలైన ఆసక్తికరమైన  విషయంపై చర్చ మొదలైంది ఏ పార్టీ ఏ పార్టీతో విలీనమై మేయర్ పీఠాన్ని దక్కించుకోనున్నది అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ముందు నుండి అందరూ ఊహిస్తున్నట్లుగానే తెరాస ఎంఐఎం తో కలుస్తారా...? లేదా ఇంకేమైనా కొత్త రాజకీయాలు జరుగుతాయా...అయితే ఇప్పటికైతే ఎటువంటి సమాచారం లేదు. మరి మున్ముందు ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: