అత్తా కోడళ్ళ మధ్య గొడవ.. చివరికి ఎంత దారుణం జరిగిపోయింది..?
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది... విజయవాడ సమీపంలోని పునాదిపాడు లో అత్తా కోడళ్ళ మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. బీసీ కాలనీకి చెందిన తిరుపతమ్మ పద్మావతి అత్తా కోడళ్లు.
అయితే ఎనిమిదేళ్ల కిందట భర్త చనిపోవడంతో పద్మావతి అత్త తిరుపతమ్మ తో కలిసి జీవిస్తుంది. పద్మావతి పిల్లలకు పెళ్లి కావడంతో వేరేచోటికి వెళ్లిపోయారు. అయితే కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నా అత్త కోడళ్లు గత కొన్ని రోజుల నుంచి ప్రతి విషయంలో గొడవలు పడడం మొదలుపెట్టారు. ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా పద్మావతిని సూటిపోటి మాటలు అనేది అత్త.
వీరిద్దరి మధ్య మరోసారి వివాదం తలెత్తడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పోయింది ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తురాలైన కోడలు పద్మావతి ఏకంగా రోకలిబండతో అత్త తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వృద్దురాలు తిరుపతమ్మ రక్తపు మడుగులో పడి పోయింది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు తిరుపతమ్మ మృతి చెందింది అంటూ నిర్ధారించారు. ఇక తిరుపతమ్మ కూతురు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పద్మావతీని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.