ఏలూరులో వింతరోగం.. బ్రహ్మంగారి కాలజ్ఞానంతో పోలుస్తూ వదంతులు
ఇంతమంది ఒకేసారి అస్వస్థతకు గురవడానికి కారణాలేమిటో వైద్యులు, అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మూడు రోజులుగా తాగునీరు రంగుమారి వస్తోందని, వాటిని తాగడం వల్లే ఇలా జరిగిందని బాధితులు చెబుతున్నారు. అస్వస్థతకు నీటి కాలుష్యమే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నా అసలు విషయం ఏంటో తెలియరాలేదని ఆందోళనగానే ఉన్నారు స్థానికులు. బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి విజయవాడలోని సిద్దార్థ వైద్య కళాశాలకు తీసుకొచ్చారు. వీటిని పరీక్షించాక అస్వస్థతకు సరైన కారణాలు తెలుస్తాయి.
శనివారం సాయంత్రం నుంచి రాత్రి 12 గంటల వరకు ఆసుపత్రికి 100మందికి పైగా ఇవే లక్షణాలతో వచ్చారు. వీరందరికీ వెంటనే ఆక్సిజన్ అందించడంతో కొద్దిసేపటికే తేరుకున్నారు. కొందరు మూర్ఛ లక్షణాలతో, ఇంకొందరు స్పృహ తప్పి పడిపోయే పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం ఊరటనిచ్చే అంశం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అధికారులతో కలిసి ఏలూరులో పర్యటించారు. అస్వస్థతకు గురైన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు మంత్రి. విజయవాడలోనూ అత్యవసర ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని అన్నారు. వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాట్సప్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తల్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.