రేవంత్ ఆశలు అడియాసలు... ఇప్పుడు ఆ ఒక్క దారే దిక్కా... ?
టీ కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు, గొడవలు, ఒకరంటే మరొకరికి పడదు... నేతల్లో ఒకరు బాగుపడుతుంటే అక్కడ పుల్లలు పెట్టే వాళ్లు, చెడగొట్టే వాళ్లే ఎక్కువ. ఇప్పటికే వయస్సు అయిపోయి రాజకీయాలకు దూరంగా ఉంటోన్న వి. హన్మంతరావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలు సైతం టీ పీసీసీ రేసులో ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు. రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం రేవంత్‌కు ఈ పదవి రాకుండా బలమైన లాబీయింగ్ చేస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ లీడర్ మల్లు భట్టీవిక్రమార్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు కూడా పీసీసీ రేసులో ఉన్నారు. వీరంతా కూడా ఎవరికి వారు తామూ పీసీసీ రేసులో ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు. నిన్నటి వరకు రేవంత్‌కు ఖచ్చితంగా పీసీసీ పదవి వస్తుందనుకున్న వారంతా ఇప్పుడు తెరవెనక జరుగుతోన్న లాబీయింగ్ చూసి కష్టమే అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కంగ్రాట్స్ చెప్పడంతో కాబోయే పీసీసీ అధ్యక్షుడు ఆయనే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే రేవంత్‌కు పీసీసీ పదవి రాకపోతే ఆయనకు బీజేపీ మాత్రమే పెద్ద దిక్కుగా కనిపిస్తోంది. రేవంత్‌ను ఈ ముసలి కాంగ్రెస్‌లో ముసలీ లీడర్లు ఎదగనిచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు రేవంత్‌కు బీజేపీ బెస్ట్ ఆప్షన్ అయినా అక్కడ కూడా రేవంత్ కలలు కంటున్నట్టు ముఖ్యమంత్రి పీఠం అయితే ఖచ్చితంగా ఇవ్వరు. మహా అయితే రేవంత్ బీజేపీలోకి వెళ్లి... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా మంత్రి స్థాయికి మాత్రమే ఎదుగుతారు. ఏదేమైనా రేవంత్ ఫ్యూచర్ అష్టకష్టాల్లో పడింది.