కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి బెస్టాఫ్ లక్ చెప్పిన ఉత్తమ్ ? పోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందా ?

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎంపికపై చాలా రోజులు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తూనే వస్తోంది. రేవంత్ రెడ్డికి ఈ పదవి దక్కబోతుంది అంటూ హడావుడి నడిచినా, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు రేవంత్ కు ఆ పదవి ఇచ్చేందుకు ఒప్పుకోకుండా, అధిష్టానానికి తమ నిరసనలు ,విజ్ఞప్తులు చేస్తూ ఉండడం వంటి వ్యవహారాలు కారణంగా ఎప్పటికప్పుడు ఈ పదవిని భర్తీ చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వాయిదా వేస్తూ వచ్చింది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలు అవ్వడం , అలాగే గ్రేటర్ ఎన్నికలలోనూ రెండు స్థానాలకు పరిమితం అయిపోవడం వంటి వ్యవహారాలతో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పదవిని భర్తీ చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానికి ఏర్పడింది. 




ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం పార్టీలోని సీనియర్ నాయకులు , మాజీ ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి ,రేవంత్ రెడ్డి, వి హనుమంత రావు వంటివారు పోటీపడుతున్నారు. అయితే పిసిసి అధ్యక్షుడి ఎంపిక పై పూర్తి స్థాయిలో అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత మాత్రమే ఈ పదవుల భర్తీ చేయాలని భావించిన అధిష్టానం అందరితోనూ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాబోతున్నాడు అంటూ పెద్దఎత్తున ప్రచారం నడిచింది. దీనికి తగ్గట్టుగానే కొత్త అధ్యక్షుడి ఎంపిక నిమిత్తం పార్టీ వ్యవహారాల ఇంచర్జి మాణిక్యం ఠాకూర్ నేతృత్వంలో గాంధీభవన్ లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించగా, తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ సోనియాగాంధీకి అప్పగిస్తున్నట్లు మాత్రమే ఈ సమావేశంలో నిర్ణయించారు.




 అయితే ఈ సమావేశం ముగియగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఉత్తమ్ కుమార్ రెడ్డి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంతో ఆయన పేరు ఫైనల్ అయినట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది.ఇదే విషయమై ఉత్తమ్ కుమార్ రెడ్డి ని క్లారిటీ అడగగా కోర్ కమిటీలో తన అభిప్రాయాన్ని చెప్పలేదని, పార్టీ అధిష్ఠానం ఎవర్ని నియమించినా, తమకు అంగీకారమే అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పిసిసి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు గా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: