వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు..!
కరోనా సెకండ్ వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఏపీ సర్కార్ అలెర్ట్ అయ్యింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో చాలావరకు కేసులు కంట్రోల్ లోకి వచ్చాయి. అయితే సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నివేదికలు రావడంతో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఇప్పటికే పాఠశాలలు తెరవడంతో టీచర్లకు.. విద్యార్ధులకు ఎప్పటికప్పుడు కరోనా టెస్టులు నిర్వహించాలని భావిస్తోంది. ప్రతి 15 రోజులకోసారి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇదే సందర్భంలో రోజువారీ నిర్వహించే కరోనా పరీక్షలను మరింత ఎక్కువ చేపట్టాలని భావిస్తోంది. కరోనా టెస్టుల్లో దేశవ్యాప్తంగా ఏపీ అగ్రభాగాన ఉంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఓవైపు కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకుంటూనే మరోవైపు వ్యాక్సిన్ సన్నద్దతకు ప్రిపేర్ అవుతోంది సర్కార్. ప్రస్తుతం బ్రిటన్‌లో వ్యాక్సిన్ అందిస్తున్నారు. దేశంలో భారత్ బయోటెక్ వంటి సంస్థలతోపాటు ఇంకొన్ని సంస్ధలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రం సూచనలమేరకు వ్యాక్సిన్ సన్నద్దతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. ఏపీలో ఎంతమందికి వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంటుందనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఏపీలో మొత్తంగా జనాభా దాదాపు 6 కోట్లుగా ఉంటే.. తొలి విడతలో కోటి మందికే వాక్సీన్ ఇచ్చే అవకాశం కన్పిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వాక్సీన్ స్టోరేజీ, పంపిణీ, ప్రజలకు వ్యాక్సీన్‌ను వేయడంపై రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమవుతోంది. స్టోరేజ్ కోసం తగిన కోల్డ్ ఛెయిన్లు రెడీ చేసుకోవడంపై అధికారులు ఫోకస్ పెట్టారు. దాదాపు 4వేల 65 కోల్డ్ ఛెయిన్ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుందని అంచనా. అందులో 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వరకు వాక్సీన్లను భద్రపర్చాల్సి ఉంటుంది. ఇక వాక్సీన్ వేయడానికి 19వేల మంది ఏఎన్ఎంలను సిద్ధంచేస్తున్నారు. వాక్సీన్ రవాణా కోసం 29 రిఫ్రిజిరేటెడ్ వాహనాలు సిద్దం చేస్తోంది ప్రభుత్వం. ఇక ఎక్కడికక్కడ టాస్క్ఫోర్సులను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను సిద్ధంచేస్తున్నారు.