రద్దు చేసే వరకు తగ్గేదే లేదు..!
అన్నదాతల నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ సరిహద్దులు మార్మోగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఉక్కు సంకల్పం చెక్కుచెదరటం లేదు. దేశంలో రైతాంగ ఉద్యమాలలో సరి కొత్త చరిత్రను లిఖిస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, ట్రాలీలు, ఎడ్లబండ్లతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులపై సాగిస్తున్న బైఠాయింపు 20 రోజులకు చేరింది.
కేంద్రం మొండిగా వ్యవహరించినా, రైతులను సంఘ విద్రోహ శక్తులని విమర్శించినా, ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా పోరాటం రోజు రోజుకూ మరింత ఉధృతంగా, విస్తృతంగా మారుతోంది. రైతుల పోరాటానికి వందలాది రైతు సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, ఎన్నో ప్రజాసంఘాలు, మేధావుల విశాల మద్దతు, సంఘీభావం లభిస్తోంది.
జాతికి అన్నం పెట్టే రైతుల చేతులను నరికేయొద్దని రైతుల పోరాటం నినదిస్తోంది. మొదట పంజాబ్ రైతులకే ఉద్యమం పరిమితమని బిజెపి భావించింది. కానీ, ఢిల్లీ ముట్టడి రైతు ఉద్యమ అసలు స్వరూపాన్ని ప్రచంచానికి చాటింది. ఈ స్థాయిలో వ్యతిరేకిస్తున్నా, చట్టాల సమూల రద్దు కాకుండా కొన్ని సవరణలు చేస్తామని మోడీ సర్కారు చెప్తోంది.
అటు ఢిల్లీ సరిహద్దుల్లో రోజు రోజుకు నిరసనకారుల సంఖ్య పెరుగుతున్నారు. ఒకరు వెనక్కు వెళితే ఇద్దరు ముగ్గురు వస్తున్నారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రంగా మారుతోంది. విపరీతంగా తరలివస్తున్న రైతులను నియంత్రించడం కోసం పోలీసులు పంజాబ్, హర్యానా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుండి అంబాల , ఢిల్లీ నుండి హిసార్ రోడ్స్ రైతుల ఆందోళనతో మూతపడ్డాయి. ఎవరైనా ఢిల్లీ లోకి ప్రవేశించాలి అనుకుంటే గ్రామాల లింకు రోడ్ల ద్వారా సుదూర ప్రయాణాలు చేయాల్సిందే..
వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే తాము వెళ్లేది లేదని రైతులు తేల్చి చెప్తున్నారు. 6 నెలల రేషన్ కూడా తెచ్చుకున్నామని, శిబిరాల వద్ద సౌకర్యాల కొరత ఉన్నప్పటికీ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్తున్నారు. అటు ఢిల్లీ పోలీసులు రాజధాని సరిహద్దుల్లో సెక్యూరిటీ పెంచారు. సింఘు బార్డర్లో మల్లీలేయర్డ్ సిమెంట్ బారియర్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించారు. రెండో వరుసలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారామిలటరీ ఫోర్సెస్ను మోహరించారు. ప్రయాణికులు ఆల్టర్నేటివ్ రూట్లలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
మరోపక్క రోడ్లను బ్లాక్ చేసి ఇబ్బందులు పెడుతున్నందుకు ప్రజలు క్షమించాలని రైతులు కోరుతున్నారు. రోడ్లను బ్లాక్ చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదు. అవసరం కోసం మేం ఇక్కడ కూర్చున్నాం. మీకు కలిగిస్తున్న ఇబ్బందికి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. అని విజ్ఞప్తి చేస్తున్నారు.