కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!
కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్ కావాలనుకునేవారు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. స్పాట్ రిజిస్ట్రేషన్ వంటివాటికి అవకాశమే లేదు. ఒక జిల్లాకు ఒకే కంపెనీకి చెందిన టీకాను కేటాయించాలి. టీకా పొందే వ్యక్తి కేంద్రానికి వచ్చే వరకు వ్యాక్సిన్, డైల్యుయెంట్లను వ్యాక్సిన్ క్యారియర్‌లో జాగ్రత్తగా మూసి ఉంచాలి.
మొదట హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 50 ఏళ్లు పైబడినవారికి టీకా ఇవ్వడంలో ప్రియార్టీ ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి 50ఏళ్ల లోపువారికి అందిస్తారు. ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తాజా ఓటర్ల జాబితా ఆధారంగా 50ఏళ్లు పైబడిన వారిని గుర్తిస్తారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలు సమాయత్తమవుతున్నాయి. జనవరిలో వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ కావాలనుకునే వారు 'కొవిన్' యాప్ లో రిజిష్ట్రేషన్ చేసుకోవాలి. టీకా ఏ తేదీలో, ఏ సమయంలో ఇస్తారు.. ఏ కేంద్రానికి వెళ్లాలి తదితర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారికి ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి. ఇందుకోసం కేంద్రం మొత్తం 12 రకాల గుర్తింపు కార్డులకు అనుమతి ఇచ్చింది. తొలి దశ టీకా పంపిణీలో దాదాపు 30కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
మొత్తానికి మన దేశంలో కొద్ది రోజుల్లోనే కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ కాబోతోంది. వ్యాక్సినేషన్ పై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి.