జగన్ ను వదలనంటున్న పవన్ ? మరో ఉద్యమం ?

ఆరు నూరైనా.. నూరు ఆరైనా ఏపీ సీఎం జగన్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటికే రైతు ఉద్యమం, వివిధ పోరాటాలు అంటూ వైసీపీ ప్రభుత్వం పై పవన్ విమర్శలు చేస్తూ రాజకీయంగా వైసీపీ ని బలహీనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో బీజేపీ కలిసి వచ్చినా, తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా ఏపీ ప్రభుత్వంపై జనసేన తరఫున పోరాడాలనే విషయంపై క్లారిటీ గా ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అంటూ కొన్ని జిల్లాల్లో పర్యటించి హడావుడి చేశారు తాజాగా వైసీపీ ప్రభుత్వం పై మరో ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈనెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పోరుబాట పట్టాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వైసీపీ ప్రభుత్వం పై ఏ విధంగా పోరాడాలనే విషయంపైన లోతుగా చర్చించారు.





ముఖ్యంగా రైతుల సమస్యలపై వైసీపీ ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని, దానికి నిరసనగా ఈనెల 28వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు,  బైఠాయింపులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి నాయకులు , నియోజకవర్గ ఇన్చార్జిలు ఈ ఆందోళన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పెద్దఎత్తున పార్టీ శ్రేణులతో పోరాటం చేస్తారని జనసేన పేర్కొంది. తమ నిరసనను తెలియ చేయడమే కాకుండా, దీనిపై జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు . 




తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 35 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి అనేది జనసేన డిమాండ్. తక్షణ సహాయం కింద 10 వేలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో, ఈ నెల 28న పెద్దఎత్తున ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమాలు పవన్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ ని ఆహ్వానించారా లేక ఒంటరిగానే జనసేన ఈ కార్యక్రమాన్ని చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: