మళ్ళీ నవ్వులపాలు అవుతున్న లోకేష్..ఈసారి..?
తాజాగా వరదల్లో నష్టపోయిన రైతుల పరిహారం విషయంలో , లోకేశ్ మాట్లాడుతూ.. 33 శాతం పంటలు నష్టపోతేగానీ పరిహారం ఇవ్వరా ? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయం మీడియాలో వచ్చింది. దీనికి సంబంధించిన జీవోను తెరపైకి తెచ్చిన వైసీపీ వర్గాలు దీనికి కారణం ఆయన తండ్రి, చంద్రబాబునాయుడే కారణమని తెలిపారు. 33 శాతం పంట నష్టపోతే పరిహారం ఇవ్వాలన్న నిబంధన కొత్తగా సీఎం జగన్ తీసుకురాలేదని చెప్పారు. 33 శాతం పంటలు నష్టపోతేనే పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ 2015 డిసెంబర్ 4న చంద్రబాబు ప్రభుత్వం జీవోఎంఎస్ 15 జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ జీవో ఇచ్చినప్పుడు లోకేశ్‌కు అంత అవగాహన ఉండి ఉండదన్నారు. జీవోలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయన్నారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనలు, వీటిని ఎలా పొందుపరిచారో లోకేశ్ తెలుసుకోవాలని హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారమే చేస్తామన్నారు. చంద్రబాబు 2014లో జరిగిన పంట నష్టాలకు కూడా 2019లోనూ పరిహారం ఇవ్వలేదంటూ టీడీపీ హయాంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు. సమస్యలు, జీవోలపై అవగాహన లేకుండా మాట్లాడితే అది తమకే చేటు తెస్తుందనే విషయాన్ని లోకేశ్ గుర్తించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.